Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కూల్ యాజమాన్యం, టీచర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఎస్ఎఫ్ఐ ధర్నా
- ఆందోళన చేస్తున్న నాయకుల అరెస్ట్
నవతెలంగాణ-హయత్‌నగర్
టీచర్ మందలించిందన్న కారణంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్ఐ సూర్య తెలిపిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ బంజారా కాలనీలో నివాసం ఉంటున్న కరంటోతు లకపతి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని పెద్ద కుమార్తె అక్షయ శాశ్విత(13) ఆర్టీసీ కాలనీలోని శాంతినికేతన్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కాగా, గురువారం క్లాస్‌లో అక్షయ మరో బాలికతో కలిసి అల్లరి చేస్తుండటంతో ఇద్దరినీ టీచర్ బయట నిలబెట్టింది. దాంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అయితే టీచర్ బాలికను తీవ్రంగా మందలించి గోడకూర్చి వేయించి అవమానించడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడిందని శుక్రవారం మృతురాలి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నేతలు అనుమానిస్తూ ధర్నా చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి
విద్యార్థిని మృతికి కారణమైన శాంతినికేతన్ పాఠశాల యాజమాన్య ంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, పాఠశాల గుర్తిం పును రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. ఆ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి గుండె శివకుమార్ మాట్లాడు తూ.. విద్యార్థిని అక్షయ (13) తనకు స్కూల్లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేకనే సూసైడ్ చేసుకుందన్నారు. దీనికి కారణమైన స్కూల్ యాజమాన్యం, క్లాస్ టీచర్ జమీలా వంశీపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల కిందట కూడా ఈ పాఠశాల లో విద్యార్థులను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి రూ. 25 లక్షలు పరిహారాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ నాయకులు జగన్, వంశీ, ప్రవీణ్, సాయి, సీపీఐ(ఎంఎల్) నాయకులు పాల్గొన్నారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.