Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యల నిలయంగా ఎస్టీ గురుకులాలు, వసతిగృహాలు
- భద్రాచలం ఐటీడీఏ పరిధిలో పలుచోట్ల విద్యార్థుల అవస్థలు
- పురుగుల అన్నం.. సుబ్లేడు గురుకుల ప్రిన్సిపాల్‌పై వేటు
- కారేపల్లి గాంధీనగర్‌లో ఐదుగురిని కరిచిన ఎలుకలు..
- కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణా లోపం
- నిధుల లేమితో మెనూ అమలుకు ఆపసోపాలు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ, వసతిగృహాల నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా మారింది. అద్దె, శాశ్వత భవనాల్లో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాలు సమస్యల నిలయంగా మారాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఎక్కడా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రిన్సిపాళ్లు, వార్డెన్ల నిర్లక్ష్యం కూడా దీనికి తోడవడంతో పలుచోట్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కారేపల్లి మండలం గాంధీనగర్ గురుకులం గుట్టకు ఆనుకుని ఉండటంతో మొదటి అంతస్తులోకి ఎలుకలు ప్రవేశించి ఐదుగురు విద్యార్థులను కరిచాయి. మరోవైపు తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు వద్ద ఉన్న గురుకులంలో అన్నంలో పురుగులు వస్తున్నాయి. కుళ్లిన కూరగాయలు, పాడైన పండ్లు ఇస్తున్నారని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వీటిపై ఐటీడీఏ అధికారులు విచారణకు ఆదేశించారు. రెండు గురుకులాలను సందర్శించిన అధికారులు సుబ్లేడ్‌లో ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. పీఈడీగా విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగినీ తొలగించారు. గాంధీనగర్‌లో గురుకులంలో సామర్థ్యానికి మించి విద్యార్థులున్నారని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ విజయలక్ష్మి అంగీకరించారు. 640 మంది విద్యార్థులకు సరిపడా వసతులు లేని కారణంగా ఇంటర్ విద్యార్థులను అప్పాయిగూడెంలోని ఎస్ఎం హాస్టల్ భవనానికి తరలించేందుకు తగిన ఆదేశాలు ఇస్తామన్నారు. ఇవి ఈ రెండు గురుకులాలు, వసతిగృహాల దుస్థితే కాదు రీజియన్ పరిధిలోని అన్ని జిల్లాల్లో ఇలాగే ఉందని విద్యార్థిసంఘాలు అంటున్నాయి.
26వేల మంది విద్యార్థుల వెతలు..
అరకొర వసతులు, మెనూ సక్రమంగా అమలు కాకపోవడంతో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 26,278 మంది విద్యార్థులు వెతలు పడుతున్నారు. మొత్తం 305 విద్యాసంస్థలు ఉండగా వీటిలో బాలురు 10,921, బాలికలు 9,228 మంది విద్యనభ్యసిస్తున్నారు. కళాశాల వసతి గృహాలు 22 ఉండగా 3,243 మంది, ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలు 219 ఉండగా 6,129, వసతిగృహాలు 14 ఉండగా 1275, ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు 50 ఉండగా 15,600 మంది చదువుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 18 గురుకులాలు ఉండగా 9,960 మంది ఉన్నారు. వీరి భోజనానికి కావాల్సిన బియ్యం, పంచదార, పప్పులు జీసీసీ సరఫరా చేస్తుండగా కూరగాయలు, గుడ్లు, చికెన్, మటన్, కాస్మొటిక్స్ వంటివి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. అయితే ఈ కాంట్రాక్టును ప్రాంతీయ సమన్వయ అధికారి (ఆర్సీవో) తనకు తెలిసిన వారికి కట్టబెడుతుండటంతో సరుకుల్లో నాణ్యత లోపిస్తోందని ఆరోపణలున్నాయి.
పర్యవేక్షణ లోపం..
గురుకులాలు, వసతిగృహాల్లో మూడో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థుల వరకూ ఉంటున్నారు. వీటి పర్యవేక్షణ కోసం ఓ అధికారిని ప్రత్యేకంగా నియమించాల్సి ఉండగా ఐటీడీఏ ఏపీవోగా ఉన్న అధికారినే గురుకులాల ఇన్చార్జి ఆర్సీవోగా నియమించారు. రీజియన్ల వారీగా ఏర్పాటు చేసిన ఈ ఆర్సీవోకు సహకారం అందించేందుకు ఏఆర్సీవోలు ఉన్నారు. ఇక పలు గురుకులాలు ప్రయివేటు బిల్డింగ్‌లో కొనసాగుతుండగా కొన్ని శాశ్వత భవనాల్లో ఉన్నా అరకొర వసతులు వెంటాడుతున్నాయి. సుబ్లేడు గురుకుల భవనాన్ని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాలుగు అంతస్తులు నిర్మించారు. పలుచోట్ల సరిపడా వర్కర్స్ లేరు, విద్యార్థులే వండి వార్చుకోవాల్సి వస్తోంది. మెనూ పక్కకు పడేవేశారు. కాంట్రాక్టర్లు ఏవి పంపితే అవే వండిపెడుతున్నారు. అనేక చోట్ల పారిశుధ్యం లోపిస్తుంది.కొన్ని హాస్టల్స్‌లో తాగునీటి సౌకర్యమూ సక్రమంగా లేదు. ప్రహరీగోడలు లేకపోవడంతో పందులు, కుక్కలు, పశువులు స్వైర విహారం చేస్తున్నాయి. కారేపల్లి గాంధీనగర్ గురుకులంలో 640 మంది విద్యార్థులకు సరిపడా బిల్డింగ్ లేకపోవడంతో డార్మెటరీలోనే క్లాస్‌లు బోధిస్తున్నారు. దోమల విజృంభణతో ఇక్కడి విద్యార్థులు 15 మంది జ్వరాల బారిన పడ్డారు. ఇద్దరు డెంగీతో ఇబ్బంది పడుతున్నారు.
గతి తప్పిన మెనూ..
2017 జూన్‌లో మెస్ చార్జీలు పెంచారు. రూ. 200 నుంచి రూ.450 వరకు ఈ పెంపుదల ఉంది. మూడు నుంచి ఏడు తరగతుల విద్యార్థులకు గతంలో ప్రతినెలా రూ.750 చొప్పున చెల్లించే దానిని రూ.950 చేశారు. 8 నుంచి 10 తరగతులకు రూ.850 నుంచి రూ.1100, ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1050 నుంచి రూ.1500లకు పెంచారు. నెలలో నాలుగు సార్లు రెండు, నాలుగో ఆది, గురువారాల్లో చికెన్, మొదటి, మూడో ఆదివారం మటన్, ప్రతిరోజు నెయ్యి, ప్రతి గురువారం పూరి, సోమవారం నూడిల్స్, ఆదివారం చపాతి, గురువారం రాగి, జొన్న, సజ్జ జావ లేదా బిస్కెట్స్, సేమియా, స్నాక్స్ వంటివి మెనూగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 2017 నాటికి ఇప్పటికీ ధరల్లో భారీ వ్యత్యాసం వచ్చింది. ఒక్కో విద్యార్థికి రోజుకు ఒక్కంటికీ రూ.35-40 వరకు పడుతుంది. ఈ కొద్దిపాటి బడ్జెట్‌తో మెనూ అమలు చేయడం భారంగా మారిందని అధికారుల నుంచి వినిపిస్తున్న మాట.
మెడికల్ లీవ్‌లో ఉన్నా..
- డేవిడ్‌రాజ్, ఆర్సీవో
గురుకుల విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేసిన విషయం నాకు తెలియదు. ప్రస్తుతం నేను మెడికల్ లీవ్‌లో ఉన్నా. సుబ్లేడు, గాంధీనగర్ ఘటనల గురించి తెలిసినా లీవ్‌లో ఉన్న దృష్ట్యా తానెటువంటి చర్యలు తీసుకోలేను.