Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాటి ఉద్యమ ఫలితమే తగ్గిన సంస్కరణల వేగం
- బషీర్‌బాగ్ ఘటనకు 22 ఏండ్లు..
- అమరులకు వామపక్ష నేతల నివాళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బషీర్‌బాగ్ విద్యుత్ పోరాటంలో అశువులుబాసిన సత్తెనపల్లి రామకృష్ణ, విష్ణువర్దన్‌రెడ్డి,బాలస్వామి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. నాటి ఉద్యమ స్ఫూర్తితో మున్ముందు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. విద్యుత్ అమరవీరుల సంస్మరణదినోత్సవాన్ని వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం)పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆ నాడు ఉద్యమం జరగక పోతే..దేశంలో, రాష్ట్రంలో సంస్కరణల ప్రభావం ఎలా ఉండేదో ఊహించగలమన్నారు. వారి నిర్ణయాలకు ఎదురే లేకుండా పోయేదని చెప్పారు. 22 రెండేండ్ల కింద జరిగిన ఆ పోరాటం ఫలితంగానే ఈ రోజు వరకు పాలక వర్గాలు సంస్కరణలను అమలు చేయలేక పోయాయని చెప్పారు. అనేక దఫాలు సంస్కరణలు తీసుకురావాలని ప్రయత్నం చేసినా.. ఉద్యోగులు, ప్రజలు పోరాటాలు చేయటం మూలంగా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యుత్ సవరణల పేరుతో మళ్లీ అట్లాంటి సంస్కరణలు తీసుకురావాలని చూస్తుందన్నారు. దీన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నదని చెప్పారు. నాడు ఏ ఉద్యమమైతే ఆ సంస్కరణలకు వెనక్కి కొట్టగలిగిందో..అలాంటి మహాఉద్యమం దేశ వ్యాప్తంగా జరగక తప్పదని హెచ్చరించారు. అటువంటి పోరాటాల ఫలితాలను దశాబ్దాలుగా మనం అనుభవించగలుగుతున్నామని చెప్పారు. ఇప్పటికే విద్యుత్ ఉద్యోగులు ఉద్యమం ప్రారంభించారనీ, ప్రజలు కూడా అనేక ప్రాంతాల్లో పోరాటాలు చేస్తున్నారనీ, కొన్ని రాష్ట్రాలు సైతం ఈ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నాయని వివరించారు. విద్యుత్ సంస్కరణలకు వెనక్కి కొట్టగలిగితే..ప్రభుత్వ ప్రజావ్యతిరేక పోరాటాలకు ఈ ఉద్యమం నాందిగా నిలుసుందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అజీజ్‌పాష, పశ్యపద్మ మాట్లాడుతూ బషీర్‌బాగ్ ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్‌లో ఉద్యమాలు తీవ్ర తరం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగాన్నంతా గుండుగుత్తగా కార్పొరేట్లకు కట్టబెట్టటం దారుణమని విమర్శించారు. ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు వ్యతిరేకంగా నాడు జరిగిన పోరాటం వల్ల సుమారు 20 ఏండ్ల పాటు పాలకులను కరెంటు వైపు కన్నెత్తి చూడకుండా చేసిందని తెలిపారు. సీపీఐ(ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవీ చలపతి రావు, వి సంద్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా వ్యవసాయం సహా అట్టడుగు వర్గాలకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీల ఎసరొస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర నాయకులు అన్మేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణలకు వ్యతిరేకంగా పోరాడుతూనే..రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై వేల కోట్ల భారాన్ని మోపిందని గుర్తుచేశారు. ఎస్‌యుసీఐ, ఎంసీపీఐ(యు) నేతలు మురహరి,వనం సుధాకర్, ఆర్ఎస్పీ గోవింద్‌తో పాటు ఫార్వవర్డ్ బ్లాక్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకులు మాట్లాడుతూ రాబోయే కాలంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఐక్యఉద్యమాలను నిర్మించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహరావు, టి సాగర్, నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ సీపీఐ నగర కార్యదర్శి ఈటీ నర్సింహ్మా, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నాయకులు జి ఝాన్సీ, ఎం శ్రీనివాస్, ప్రజాపంథా నాయకులు ఎస్ఎల్ పద్మ ఎస్‌యుసీఐ జిల్లా కార్యదర్శి తేజ, ఎంసీపీఐ(యు) నాయకులు కుంభం సుకన్య తదితరులు పాల్గొన్నారు.