Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతకు కృషి చేస్తాం
- బీజేపీని ఓడించే శక్తులకు మునుగోడులో సీపీఐ(ఎం) మద్దతు
- పోడు సమస్యలపై భద్రాచలం నుంచి హైద్రాబాద్ వరకు మహా పోడు పాదయాత్ర : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-భద్రాచలం
దేశంలో, రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకశక్తుల ఏకీకరణ జరగాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు యం.జ్యోతి అధ్యక్షతన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని రెడ్డి సత్రంలో సోమవారం పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాజకీయస్వార్ధంతో మునుగోడు ఉపఎన్నికను సృష్టించిందని, బీజేపీని ఓడించే శక్తులకు సీపీఐ(ఎం) మద్దతు తెలుపుతుందని వెల్లడించారు. బీజేపీ దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందాలనే కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నదని, తెలంగాణలోనూ మతఘర్షణలు సృష్టించి ప్రజల ఐక్యత, శాంతికి తీవ్రవిఘాతం కల్పిస్తుందన్నారు. కార్పొరేట్ శక్తుల అనుకూల ఆర్థిక విధానాలు, మతోన్మాద చర్యలను వేగంగా అమలు జరుపుతున్న బీజేపీపై బలమైన సమరశీల పోరాటాలు జరపాలని పార్టీ శ్రేణులకు తమ్మినేని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పోడుభూముల సమస్యను పరిష్కారం చేయటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పోడు భూముల హక్కుల కోసం, పోడు సాగుదారులపై నిర్భందానికి వ్యతిరేకంగా త్వరలోనే భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు మహా పోడు పాదయాత్ర చేస్తామని వివరించారు. కార్మికుల కనీస వేతనాల జీవోలు విడుదల చేయాలని, 36 రోజుల నుంచి సమ్మె చేస్తున్న వీఆర్ఏల సమస్యలను పరిష్కారం చేసి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్ చేశారు. గోదావరి వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల వరద సహాయం నేటికీ పూర్తిస్ధాయిలో అందలేదని వెంటనే అందించాలన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతూనే, రాష్ట్రంలో బీజేపీని నిలువరించేందుకు పోరాటాలను ఉధృతం చేయాలని చెప్పారు. వర్గ సామాజిక సమస్యలపై గ్రామస్థాయిలో ఉద్యమాలను చేయటం ద్వారా క్షేత్రస్థాయిలో సీపీఐ(ఎం) బలోపేతానికి కృషిచేయాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. సమావేశం ప్రారంభ సూచికగా పార్టీ జెండాను పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ మిడియం బాబురావు ఆవిష్కరించారు. నియోజకవర్గాల వారీగా చర్చా కార్యక్రమం సాగింది. సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్రాములు, మచ్చా వెంకటేశ్వర్లు, కాసాని అయిలయ్య, సీనియర్ నాయకులు గుగులోత్ ధర్మా, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, కె.బ్రహ్మాచారి, కారం పుల్లయ్య, యం.బి.నర్సారెడ్డి, లిక్కిబాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు, అన్నీ మండలాల, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.