Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సమస్యలతో ముందుకు..
- జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ కొత్త అజెండా
- ఆ క్రమంలోనే రైతు నేతలతో భేటీ
- త్వరలోనే పలు రాష్ట్రాల్లో సమావేశాలు...?
- రాష్ట్రంలోని పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని యోచన
- అదే సమయంలో బీజేపీ.. రైతు వ్యతిరేక విధానాలపై ఫోకస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'దేశవ్యాప్తంగా రైతుల పక్షాన, వారి సమస్యలపై పోరుకు కేసీఆర్ నాయకత్వం వహించాలి...' హైదరాబాద్లోని ప్రగతి భవన్లో వివిధ రాష్ట్రాల రైతు ప్రతినిధులతో నిర్వహించిన భేటీల తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదివారం వెలువడిన ప్రకటన అది. ఆ సందర్భంగా రైతు నేతలందరూ సీఎంను తమ పోరాటానికి నాయకత్వం వహించాలని తీర్మానించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ... 'దేశవ్యాప్తంగా పోరాటాలకు నన్ను నాయకత్వం వహించాలంటూ కోరుతున్నారు. పోమ్మంటరా... పోదామంటరా...' అంటూ సభికులను అడిగి వారి మద్దతు తీసుకున్నారు. ఈ రెండు ఘటనల ద్వారా గతంలో గులాబీ బాస్ చెప్పిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పక్కకుపోయి... రైతు సమస్యల అజెండా అనేది టీఆర్ఎస్ వ్యూహంలో ముందుకొచ్చిందా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఇటీవల నిర్వహించిన ప్రతి సమావేశం, సభలోనూ ముఖ్యమంత్రి పదేపదే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. 'మేం మా రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటును ఇస్తున్నాం.. మీరెందుకివ్వరు...?' అంటూ ఇటీవల ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గతంలో అనుకున్న విధంగా బీఆర్ఎస్ కాకుండా అన్నదాత సమస్యలే అజెండాగా ముందుకు సాగేందుకు కారు సారు భావిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో రైతులకు ఎరువులు, పురుగు మందులపై సబ్సిడీల ఎత్తివేత, వ్యవసాయ నల్ల చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు తదితరాంశాలపై ప్రధానంగా ఫోకస్ చేయాలని ఆయన యోచిస్తున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే ఇటీవల పలు రాష్ట్రాలకు చెందిన రైతులతో ఆయన భేటీ అయ్యారు. వారితో సమాలోచనల అనంతరం త్వరలోనే వివిధ రాష్ట్రాల్లో పర్యటించటం ద్వారా బీజేపీ విధానాలను ఆయా రాష్ట్రాల్లో ఎండగట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు వినికిడి.
మరోవైపు జాతీయ రాజకీయాల్లో కాలు మోపాలంటే ఇప్పటికిప్పుడు ఒక కొత్త అజెండాను తెరపైకి తీసుకు రావాలంటూ కేసీఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా అలాంటి ప్రధానాంశం 'రైతు సమస్యలే' తప్ప వేరేది లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల ముందు అన్నదాతల ఆత్మహత్యలు, వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్లు, సాగునీటి వనరుల పంపకం, నదుల అనుసంధానం, నదీ జలాల సమస్యలు, వీటన్నింటినీ పరిష్కరించటంలో బీజేపీ వైఫల్యం అనే అంశాలను ప్రధానంగా తీసుకుని ఆయన ముందుకెళ్లనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
తద్వారా జాతీయ రాజకీయాల్లో ఒక చర్చ లేవదీసేందుకు వీలుగా సీఎం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ మున్ముందు పరిస్థితులు కలిసొస్తే అప్పుడు బీఆర్ఎస్ లాంటి దాన్ని ఏర్పాటు చేసినా... రైతు సమస్యల అజెండాగా ఆ పార్టీని సులభంగా ప్రజల్లోకి తీసుకుపోవచ్చని ఆయన భావిస్తున్నారు. 'కేసీఆర్ మంచి వక్త. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషలపై ఆయనకు మంచి పట్టుంది. తాను చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా జనం మెదళ్లలోకి ఎక్కించగలరు. ఇతర రాష్ట్రాల్లో పర్యటించేటప్పుడు ఇది ఆయనకు అదనపు బలం...' అంటూ ఓ సీనియర్ నేత ఈ సందర్భంగా వ్యాఖ్యానించటం గమనార్హం.