Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపైనా స్పష్టత కరువు
- మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారు
- అభ్యర్థుల్లో అయోమయం
- ముగిసిన ప్రాసెసింగ్ ఫీజు గడువు
- 74,773 మంది చెల్లింపు
- నేటితో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి
- ఇప్పటి వరకు 31,639 మంది ఆప్షన్ల నమోదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా సాగుతున్నది. కౌన్సెలింగ్ ప్రారంభమై పది రోజులు కావస్తున్నా ఇప్పటి వరకూ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులపై స్పష్టత రాలేదు. అయితే చాలా కాలేజీ యాజమాన్యాలు ఫీజు పెంచాలంటూ హైకోర్టును ఆశ్రయించాయి. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఖరారు చేసిన ఫీజులను అమలు చేయాలంటూ కోరాయి. దీంతో టీఏఎఫ్ఆర్సీతో కాలేజీలు అంగీకరించిన ఫీజులను అమలు చేయాలంటూ ఈనెల 22 నుంచి 26వ తేదీ వరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైనా స్పష్టత కరువైంది. హైకోర్టు ఆదేశాలు అమల్లో ఉంటాయా? లేవా? అన్నది సందిగ్ధంలో ఉన్నది. అయితే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న వెబ్సైట్లో మాత్రం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి ఫీజులను పొందుపరచలేదు. గత విద్యాసంవత్సరంలో అమల్లో ఉన్న ఫీజులే వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఏ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంత ఫీజు అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలంటూ కోరుతున్నారు.
విద్యాశాఖ అధికారులు మాత్రం పాత ఫీజులే అమల్లో ఉంటాయని చెప్తున్నారు. కానీ ఉత్తర్వులు మాత్రం జారీ చేయడం లేదు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఫీజుల పెంపుపైనా, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులుపైనా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వెబ్ఆప్షన్ల నమోదుపై ప్రభావం
ఈనెల 21 నుంచి ప్రారంభమైన ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్కౌన్సెలింగ్లో భాగంగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఇప్పటి వరకు 74,773 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారని ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు. వారిలో 62,383 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యిందని పేర్కొన్నారు. సోమవారం ఒక్కరోజే 7,152 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారని వివరించారు. ఇప్పటి వరకు 31,639 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేశారని తెలిపారు. అయితే ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు ఉత్తర్వులు వెలువడకపోడంతో ఆ ప్రభావం కౌన్సెలింగ్ పడిందని అర్థమవుతున్నది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన అభ్యర్థులు సైతం వెబ్ఆప్షన్లు నమోదు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. 62,383 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినా 31,639 మందే ఆప్షన్లు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. మంగళవారంతో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ముగియనుంది. వెబ్ఆప్షన్ల నమోదుకు వచ్చేనెల రెండు వరకు గడువున్నది. ఈలోపు ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తుందో లేదో వేచిచూడాల్సిందే.