Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజావాణిలో జేసీ ఎదుటే కిరోసిన్ పోసుకున్న వ్యక్తి
- పోలీసులు అడ్డుకోవడంతో తప్పిన ప్రమాదం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
తన భూమి గుంజుకున్నరని మనో వేదనకు గురైన వ్యక్తి ప్రజావాణిలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణిలో సోమవారం జరిగింది. సంగారెడ్డి మండలం హత్నూర మండలం బోరపట్లకు చెందిన జక్క మల్లేశం ప్రజావాణిలో భూ సమస్య గురించి ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. రిజిస్టర్లో దరఖాస్తు నమోదు చేసుకుని జేసీ రాజర్షిషా, ఇతర అధికారులకు తన సమస్యను విన్నవించుకునే ప్రయత్నంలోనే తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ బాటిల్ తీసి ఒంటిమీద పోసుకున్నాడు. అగ్గిపెట్టె తీసి గీసి నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అప్రమత్తమై బాధితుల్ని అడ్డుకున్నాడు. వెంటనే అతన్ని తీసుకెళ్లి ఒంటిపై నీళ్లు చల్లి బయటికి పంపారు. ఈ సందర్భంగా బాధితుడు సిద్ధమైన మల్లేషం మాట్లాడుతూ.. తన తండ్రి పుండరీకంకు ప్రభుత్వం 379/293 సర్వే నెంబర్లో ఎకరం భూమి ఇచ్చినట్టు తెలిపారు. తండ్రి మరణానంతరం తన పేరిట పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చారన్నారు. కాగా, గ్రామంలో సర్పంచ్ అంజమ్మ, మాజీ సర్పంచ్ దుర్గారెడ్డి తనపై కక్షకట్టి పేదలకిచ్చిన భూమిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నామని నమ్మబలికి తన భూమిని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయలేదని తహసీల్దార్ చెబుతున్నాడని తెలిపారు. దాంతో పొలం దున్ని పంట వేసిన తనపై దౌర్జన్యం చేసి తప్పుడు కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఉంచారన్నారు. సాగు చేసుకుంటున్న మా భూమిలో దుర్గారెడ్డి కడీలు పాతి పెన్సింగ్ వేశారని, దాన్ని తొలగించిన తనపై దౌర్జన్యం చేస్తున్నాడన్నారు. తన భూమి తనకు ఇప్పించాలని అనేక సార్లు ఫిర్యాదు చేసినా దుర్గారెడ్డికి భయపడి తనకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ఆధారంగా ఉన్న ఎకరం భూమిని గుంజుకుని మమ్ముల్ని వీధిన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దౌర్జానాలను ఎదిరించలేక కలెక్టర్ ముందు చనిపోదామని సిద్ధపడ్డానని తెలిపారు. ఇకనైనా కలెక్టర్ జోక్యం చేసుకుని తన ఎకరం భూమిని ఇప్పించాలని, లేనిపక్షంలో మా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుని చనిపోతామని హెచ్చరించారు.