Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల్లో పోషకాహార లేమితో రక్తహీనత
- అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యానికి కుట్ర
- బిల్కిస్ బానో కేసుపై 5న కలెక్టరేట్ల ఎదుట దీక్ష
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-నాగార్జునసాగర్
''దేశవ్యాప్తంగా పేదరికం, నిరుద్యోగం, ఆకలి పెరిగాయి.. పిల్లలు తాగే పాలపైనా జీఎస్టీ విధించడం దుర్మార్గం.. పోషకాహార లేమితో మహిళలు రక్తహీనతకు గురవుతున్నారు.. మరోవైపు దేశవ్యాప్తంగా ఐదేండ్లలోపు ఆడపిల్లలు చనిపోతున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.. ఇదే సమయంలో అంగన్వాడీ కేంద్రాలనూ నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోంది'' అని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని విజయవిహార్‌లో రెండ్రోజులపాటు నిర్వహించిన ఐద్వా రాష్ట్ర కమిటీ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. అనంతరం మల్లు లక్ష్మీ మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందన్నారు. ప్రపంచంలోని 116 దేశాల్లోకెల్లా భారతదేశం పేదరికంలో 101వ స్థానంలో ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగాయన్నారు.
1950లో నిత్యావసర ధరల చట్టాన్ని తీసుకొస్తే.. ఇప్పుడు ఆ చట్టాన్ని ఎత్తేశారని, తద్వారా ధరలు ఆకాశాన్నంటాయన్నారు. 2014లో రూ.410 ఉన్న గ్యాస్ ధర నేడు రూ.1100కు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం మహిళలకు 8 హక్కులను కల్పించిందని, వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితి నెలకొందన్నారు. డ్వాక్రాలో దాదాపు 80 శాతం మంది మహిళలు ఉన్నారని, రాష్ట్రం, జిల్లా, గ్రామ స్థాయిలో కమిటీలు వేసి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని చెప్పారు. 30శాతం మంది ఒంటరి మహిళలకు సంబంధించిన కమిటీ వేశామని, ఒంటరి మహిళల సమస్యలను తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తామని తెలిపారు. దళిత మహిళ, మైనార్టీ మహిళల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
బిల్కిస్ బానో ఐదు నెలల గర్భవతి అని చూడకుండా వెంటాడి వేటాడి 11 మంది సామూహికంగా లైంగికదాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మూడు నెలల బిడ్డను కూడా నేలకేసి కొట్టి చంపడం దారుణమన్నారు. ఆ నేరస్థులను క్షమాభిక్ష పేరుతో వదిలిపెట్టడం యావత్ దేశానికి సిగ్గుచేటన్నారు. గుజరాత్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంప్రదించకుండా నేరస్థులను ఎలా వదిలిపెట్టిందని ప్రశ్నించారు. ఆ దుర్మార్గులు బయట తిరగడం సరికాదని, తిరిగి జైలుకు పంపించాలని దేశంలోని ఆరు వేల మంది మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. 11 మంది నేరస్థులను తిరిగి జైలుకు పంపే దాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఇదే సమస్యపై జిల్లా కలెక్టరేట్ల వద్ద ఐదో తేదీన ఒకరోజు దీక్ష చేపడతామన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో స్త్రీలపై దాడులు, ముస్లిములపై గోమాత పేరుతో దాడులు పెరిగాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలూ రూపొందించలేదని, మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. చేతలు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. ఎన్నో ఏండ్లుగా 33 శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతున్నా నేటికీ అమలుకావడం లేదన్నారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, ఉపాధ్యక్షులు ఆశాలత, హైమావతి, లక్ష్మమ్మ, అహల్య, సహాయ కార్యదర్శులు ప్రభావతి, లతా, వినోద, మహేశ్వరి, నాగలక్ష్మి, అనురాధ, శశికళ, రాష్ట్ర కమిటీ సభ్యులు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.