Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో 584 ప్రయివేటు కళాశాలలకు గుర్తింపు కష్టమే...
- వాణిజ్య భవనాల్లో 457 కాలేజీలు
- ఎన్వోసీ ఇవ్వబోమంటూ ఫైర్ సర్వీసెస్ డీజీ
- ఇప్పటి వరకు 786 కళాశాలలకే అఫిలియేషన్
- విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం
- ఏటా ఇలాగే వ్యవహరిస్తున్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 586 ప్రయివేటు జూనియర్ కాలేజీలు మూతపడ్డాయి. కొన్నేండ్లుగా ఆ కాలేజీ యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేయకపోడమే ఇందుకు నిదర్శనం. మరో 584 జూనియర్ కాలేజీలకు గుర్తింపు రావడం కష్టంగానే ఉన్నది. అందులో 457 కాలేజీలు వాణిజ్య సముదాయం (మిక్స్డ్ ఆక్యుపెన్సీ)లో ఉన్నాయి. 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే కాలేజీలకు ఫైర్ ఎన్వోసీ తప్పనిసరిగా అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వాటికి ఫైర్ ఎన్వోసీ ఇవ్వబోమంటూ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ (డీజీ) కార్యాలయం స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. పలువురు మంత్రులతోపాటు హోంశాఖ, విద్యాశాఖ అధికారుల చుట్టూ కాలేజీల ప్రతినిధులు తిరుగుతున్నారు. అయినా ఇప్పటి వరకూ ఫలితం లేదు. మిగిలిన 127 కాలేజీల్లో కొన్ని సమస్యలున్నాయి. వాటి గుర్తింపు ప్రక్రియ ప్రాసెస్‌లో ఉందంటూ ఇంటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. అయితే 584 కాలేజీల్లో ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులు చదువుతున్నారు. ప్రథమ సంవత్సరంలోనూ వేలాది మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వాటికి అనుబంధ గుర్తింపు రాకపోతే వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుంది. అయితే ప్రతి ఏటా వాణిజ్య సముదాయంలోని కాలేజీల వ్యవహారం ఇలాగే కొనసాగుతున్నది. పరీక్షల వరకు ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఆదేశిస్తుంది. పరీక్షల సమయం వచ్చేనాటికి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ విద్యాసంవత్సరానికి ఆ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ క్రమంలో ప్రతి విద్యాసంవత్సరమూ పరీక్షల వరకు విద్యార్థులు దినదినగండంగా గడపాల్సి వస్తున్నది. ఇలా వారు గుర్తింపు లేని కాలేజీల్లో చదువుతూ ఉండడం గమనార్హం. చివరి నిమిషంలో ప్రభుత్వం ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయింపునివ్వకపోతే ఆ విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారే ప్రమాదముంది. అయినా ప్రభుత్వం ఈ విషయంలో స్పందించడం లేదు. ఫైర్ ఎన్వోసీ నిబంధనలు సడలించాలి లేదంటే ఆ కాలేజీలపై చర్యలు చేపట్టాలంటూ విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కొనసాగుతున్న గుర్తింపు ప్రక్రియ
రాష్ట్రంలో 406 ప్రభుత్వ, 1,042 ప్రభుత్వరంగ (వివిధ గురుకులాలు), 2,168 ప్రయివేటు జూనియర్ కాలేజీలున్నాయి. ప్రయివేటు కాలేజీల్లో 586 గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. కొన్నేండ్లుగా ఆ కాలేజీలు నడవడం లేదు. దీంతో అవి మూతపడ్డాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి 1,562 ప్రయివేటు జూనియర్ కాలేజీలు గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో ఇప్పటి వరకు 786 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ప్రకటించింది. 584 కాలేజీల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. కరోనా నేపథ్యంలో వాణిజ్య సముదాయంలో ఉన్న కాలేజీలకు రెండు విద్యాసంవత్సరాలపాటు ఫైర్ ఎన్వోసీ నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ ఆయా యాజమాన్యాలను ఆదేశించింది. దీంతో వాణిజ్య సముదాయంలోని కాలేజీలకు ఇబ్బందులు తప్పడం లేదు.
నిబంధనలు పాటిస్తేనే గుర్తింపు : జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి
ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలు పాటించిన కాలేజీలకే అనుబంధ గుర్తింపు ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. అన్ని పత్రాలూ సక్రమంగా ఉండాలని కోరారు. హైకోర్టు సూచనల మేరకు ఫైర్ ఎన్వోసీ తప్పనిసరి అని అన్నారు. గుర్తింపు లేకుండా ఏదైనా కాలేజీ నడిపితే డీఐఈవోలదే బాధ్యత అని చెప్పారు. తనిఖీలు చేపట్టి గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల ఫీజు కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి ఘటనలో విచారణ నివేదిక వచ్చిందని అన్నారు. ఆ కాలేజీపై చర్యలు తీసుకుంటామన్నారు.
సీఎం జోక్యం చేసుకోవాలి : గౌరి సతీశ్, టీపీజేఎంఏ అధ్యక్షులు
రాష్ట్రంలో 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న వాణిజ్య సముదాయంలో ఉన్న కాలేజీలన్నింటికీ అనుబంధ గుర్తింపు ప్రకటించాలని టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఆ కాలేజీలకు, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ కాలేజీలు కొత్తగా ప్రారంభించలేదనీ, 15 నుంచి 20 ఏండ్ల నుంచి నడుస్తున్నాయని వివరించారు. వాటికి ఫైర్ ఎన్వోసీ నుంచి మినహాయింపునిచ్చి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.