Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట సీపీఐ(ఎం) మహాధర్నా
- రూ.2వేల కోట్లు కేటాయించాలి: సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ఆశయ్య
నవతెలంగాణ- మంచిర్యాల
వరద ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్రం వెంటనే రూ.2వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట మంగళవారం మహాధర్నా చేశారు. ముంపు బాధితులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.ఆశయ్య కోరారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం పట్టింపులేనితనంపై బాధితులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టి అధికారం కోసం పాకులాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మునుగోడు ఉప ఎన్నికలపై ఉన్న శ్రద్ధ వరద ముంపు బాధితులను ఆదుకోవడంలో లేదని విమర్శించారు. మునుగోడులో ప్రచార సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి.. మంచిర్యాల ముంపు ప్రాంతాల్లోనూ పర్యటించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల కిందట వచ్చిన వరద ముంపుతో చాలా మంది ప్రజలకు ఆస్తి నష్టం జరిగిందని, కొన్ని సంవత్సరాల నుంచి సంపాదించుకున్న డబ్బులు, కట్టుకున్న ఇల్లు, వస్తువులన్నీ వరదలో కొట్టుకుపోయాయని తెలిపారు. వరద ముంపు కారణంగా సర్వం కోల్పోయి మనోవేదనకు గురై బాలాజీనగర్‌కు చెందిన మహిళ ఆత్మహత్య చేసుకుందన్నారు. వెంటనే బాధిత కుటుంబానికి రూ.50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ.. వరద ముంపుపై అధికారులు సర్వే చేసి నెల రోజులు గడుస్తున్నా ఇంకా బాధితులకు నష్ట పరిహారం అందలేదన్నారు. సాయం కింద ప్రతి కుటుంబానికీ లక్ష రూపాయలు అందించాలని, వరద ముంపు శాశ్వత పరిష్కారం కోసం కరకట్ట నిర్మించడంతోపాటు ఇండ్లు కోల్పోయిన వారికి ఇంటి నిర్మాణం కొరకు రూ.5 లక్షలు అందించాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో రోడ్లు, మురుగు కాలువలను పునరుద్ధరించాలని, పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి, దోమల మందును స్ప్రే చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోమాస ప్రకాష్, నాయకులు దుంపల రంజిత్ కుమార్, అశోక్, దూలం శ్రీనివాస్, కుమారస్వామి, మహేష్, రాజు, ప్రేమ్‌కుమార్, పాయిరాల రాములు, రమణ, దేవదాస్, వెంకటేష్, శ్రీనివాస్, బాధితులు పాల్గొన్నారు.