Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
- సెకండియర్‌లో 47.74 శాతం, ఫస్టియర్‌లో 67.72 శాతం ఉత్తీర్ణత
- ఆన్లైన్లో మార్కుల మెమోలు : జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో, ప్రథమ సంవత్సరం ఫలితాలను నేరుగా ప్రకటించారు. ఈనెల ఒకటి నుంచి పదో తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 1,14,289 మంది విద్యార్థులు పరీక్షలు పరీక్షలు రాస్తే, వారిలో 56,659 (49.57 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో జనరల్ కేటగిరీలో 1,02,236 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 48,816 (47.74 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 36,995 మంది బాలికలు పరీక్షలు రాస్తే, 19,828 (53.59 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 65,241 మంది బాలురు పరీక్షలు రాయగా, 28,988 (44.43 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. అంటే బాలురు కన్నా బాలికలు 9.16 శాతం మంది అధికంగా పాసయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 12,053 మంది పరీక్షలకు హాజరుకాగా, 7,843 (65.07 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 3,141 మంది పరీక్షలు రాయగా, 2,227 (70.9 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 8,912 మంది బాలురు పరీక్షలు రాస్తే, 5,616 (63.01 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో బాలురు కంటే బాలికలు 7.89 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. అంటే ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఇక ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో 2,39,411 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 1,60,143 (66.89 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇందులో జనరల్ కేటగిరీలో 2,20,456 మంది పరీక్షలు రాస్తే, 1,49,285 (67.72 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 98,168 మంది బాలికలు పరీక్షలు రాయగా, 74,048 (75.46 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 1,22,288 మంది బాలురు పరీక్షలకు హాజరైతే 75,237 (61.56 శాతం) మంది పాసయ్యారు. ఇందులోనూ బాలురు కంటే బాలికలు 13.9 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 18,955 మంది పరీక్షలు రాస్తే, 10,858 (57.28 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇందులో 5,841 మంది బాలికలు పరీక్షలు రాయగా, 4,181 (71.56 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 13,114 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, 6,677 (50.92 శాతం) మంది పాసయ్యారు.
అగ్రస్థానంలో ములుగు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో ద్వితీయ సంవత్సరంలో 89 శాతం, ప్రథమ సంవత్సరంలో 85 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో వికారాబాద్ జిల్లా 27 శాతంతో, ప్రథమ సంవత్సరంలో 55 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లాలు చివరి స్థానాన్ని పొందాయి. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మాట్లాడుతూ ఆన్లైన్ మార్కుల మెమో (tsbie.cgg.gov.in) వెబ్సైట్ నుంచి మంగళవారం ఉదయం పది గంటల నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ప్రిన్సిపాళ్లు మార్కుల మెమోలను కాలేజీ లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కాలేజీ మార్కుల రిజిస్టర్‌ను వచ్చేనెల ఐదో తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు వచ్చేనెల ఐదు నుంచి ఎనిమిదో తేదీ వరకు దరఖాస్తు చేయాలని కోరారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.100, రీవెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.600 చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ పరీక్షల నియంత్రణ అధికారి అబ్దుల్ ఖాలిక్, ఓఎస్డీ సుశీల్‌కుమార్, జాయింట్ డైరెక్టర్లు భీంసింగ్, శ్రీనివాస్, శ్రీనివాసరావు, పీఆర్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.