Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 ఏండ్ల ఆదాయం రూ.5,072.76 కోట్లు
- అభివృద్ధిపథంలో టీఎస్‌ఎమ్‌డీసీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ముమ్మరంగా ఖనిజాన్వేషణ జరుగుతున్నదనీ, 2014 నుంచి ఇప్పటి వరకు రూ.5,072.76 కోట్లను ఖజానాకు ఆర్జించిపెట్టినట్టు రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎమ్‌డీసీ) తెలిపింది. మొత్తంగా తమ సంస్థ నేతృత్వంలో 98 ఇసుక రీచులను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్పొరేషన్ అభివృద్ధిని వివరిస్తూ మంగళవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంతో పాటు ఒడిస్సా, జార్ఖండ్ రాష్ట్రాల్లో పది మైనింగ్ అన్వేషణ ప్రాజెక్టులను పూర్తిచేసినట్టు వివరించారు. మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్‌లో 210 హెక్టార్ల విస్తీర్ణంలోని సున్నపు రాయి గనిని ఓరియంట్ సిమెంట్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టుకు ఇచ్చినట్టు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో గ్రానైట్ రైజింగ్ కమ్ సేల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 9.90 హెక్టార్ల విస్తీర్ణంలోని బ్లాక్ గ్రానైట్ క్వారిని లీజుకు ఇచ్చామనీ, కరీంనగర్ జిల్లా, శంకర్‌పట్నం మండలం, కొత్తగట్టు గ్రామంలో డైమెన్షనల్ స్టోన్ గ్రానైట్ క్వారీల కోసం అన్నిరకాల చట్టబద్ధ అనుమతులను పొందినట్టు వివరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం (266 హెక్టార్లు), బండరావిర్యాల (26.88 హెక్టార్లు)లో రోడ్డు మెటల్ క్వారీల కోసం రాష్ట్ర ప్రభుత్వం లీజులను మంజూరు చేసిందన్నారు. బండరావిర్యాలలో సొంతంగా 33.22 ఎకరాల్లో మైనింగ్ చేపట్టేందుకు కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపారు. వడ్డెర సొసైటీల ద్వారా మిగిలిన 33.23 ఎకరాల్లోనూ చట్టబద్ధమైన అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. యాచారం రోడ్డు మెటల్ క్వారీ కోసం 39 ఎకరాల విస్తీర్ణంలో రోడ్డు మెటల్ యూనిట్ ఏర్పాటు కోసం అన్ని అనుమతులు వచ్చాయన్నారు. క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్స్ ఖనిజాల వెలికితీతకు దరఖాస్తు చేశామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 195.288 హెక్టార్ల విస్తీర్ణంలో మొత్తం ఏడు దరఖాస్తులకు ఫెల్డ్‌స్పార్స్ క్వారీ లీజు కోసం పీసీసీఎఫ్ నుంచి అనుమతి పొందామన్నారు. గుండ్యాల రేంజ్ ఫారెస్ట్ ఏరియాలలోని 314, 315. 316, 317 కంపార్ట్మెంట్ ద్వారా నమూనాలు సేకరించామన్నారు. ఈ క్వారీ లీజులన్నీ ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని యెల్లందు ప్రాంతం చుట్టూ ఉన్న మార్బుల్ డిపాజిట్ల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించినట్టు వివరించారు. సున్నపురాయి వెలికి తీసేందుకు 880 హెక్టార్ల లీజును మంచిర్యాల జిల్లాలోని ర్యాలీ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం, 974 హెక్టార్లలో మంచిర్యాల డివిజన్లోని ర్యాలీ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో మరొక చోట ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. మాంగనీస్ ఖనిజాన్వేషణను ఆదిలాబాద్ జిల్లా, భీంపూర్ మండలం, పింపర్కుంట బ్లాక్‌లో 48.80 హెక్టార్లులో చేపట్టామన్నారు. కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 350 చ.కి.మీ విస్తీర్ణంలో రూ. 1 కోటి 73 లక్షలు వ్యయంతో వివిధ మినరల్స్ అన్వేషణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ పనుల్లో భాగంగా ఇప్పటికే ఉపగ్రహ చిత్రాల అధ్యయనం పూర్తయిందనీ, జియోలాజికల్ మ్యాపింగ్, జియో-ఫిజికల్, కోర్ డ్రిల్లింగ్ పనులు పూర్తయ్యి, జియోలాజికల్ నివేదిక సిద్ధమవుతున్నదని వివరించారు.