Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- జన్నారం
హైదరాబాద్‌లోని గాయత్రి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ.. జన్నారం రహదారిపై విద్యార్థి మృతదేహాన్ని పెట్టి గ్రామస్తులు రాస్తారోకో చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో మంగళవారం జరిగింది. విద్యార్థి తండ్రి జక్కుల శ్రీనివాస్, ఎస్ఐ తానాజీ తెలిపిన వివరాల ప్రకారం.. కలమడుగు గ్రామానికి చెందిన జక్కుల అంజిత్ యాదవ్(20) గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వెళ్లేందుకు సర్టిఫికెట్లు కావాలని యాజమాన్యాన్ని అడగ్గా డబ్బులు చెల్లిస్తేనే ఇస్తామన్నారు. తన తండ్రి డబ్బులు కడతాడని చెప్పినా ''నువ్వు డబ్బులు కట్టినా.. కేసీఆర్ చెప్పినా.. 15 రోజుల వరకు సర్టిఫికెట్లు ఇవ్వబోం'' అంటూ వేధించారు. అప్పటివరకు ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తవుతుందని, తన భవిష్యత్తు పాడవుతుందని ఆవేదనతో మూడ్రోజుల కిందట పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెల్లడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతిందాడు. దీంతో ఎన్ఎస్యూఐ, యాదవ సంఘం నాయకులు, గ్రామస్తులు జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మృతదేహాన్ని పెట్టి ధర్నా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని నినదించారు. కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ తానాజీ అక్కడికి చేరుకుని విద్యార్థి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. విద్యార్థి సంఘాల నాయకులు సోహైల్, యాదవ సంఘం నాయకులు రాజేష్ యాదవ్, బొంతల మల్లేష్ యాదవ్, శ్రీనివాస్‌యాదవ్, దుర్గం గంగాధర్, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ముమ్మాటి సంతోష్, గోలి చందు, ప్రభుదాస్, ముత్యం రాజన్న పాల్గొన్నారు.