Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేల సర్జరీలు చేశాం.. ఎప్పుడూ ఇలా జరగలేదు: డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనకు సంబంధించి అసలు కారణాలు కనుగొనేందుకు వీలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2021-22లో 1.10 లక్షలు, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు 111 క్యాంపుల్లో 38,656 సర్జరీలు చేసినట్టు తెలిపారు. అయినా ఇలాంటి ఇబ్బందిని ఎప్పుడూ ఎదుర్కోలేదని అన్నారు. 34 మంది మహిళలకు ఈ నెల 25న దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఆధునిక విధానం డబుల్ పంచర్ లాప్రోస్కోపిని నిర్వహించామని తెలిపారు. 2016 నుంచి కుటుంబ నియంత్రణలకు సంబంధించిన టార్గెట్లను ఎత్తివేశామనీ, అప్పట్నుంచి స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారికే ఆపరేషన్లు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 34 మంది మహిళలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారేనని తెలిపారు. మరణించిన మహిళలకు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.ఐదు లక్షల పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని వివరించారు. వారి పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. మరణించిన నలుగురికి పోస్ట్ మార్టమ్ నిర్వహించామనీ, మిగిలిన 30 మంది వద్దకు మెడికల్ టీమ్‌లను పంపించి, అస్వస్థతగా ఉన్న ఏడుగురిని చికిత్స కోసం అపొలో ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. మంగళవారం మరోసారి పరీక్షలు నిర్వహించి మరో ఇద్దరిని నిమ్స్ కు తరలించామనీ, వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
విచారణ బృందం
తన నేతృత్వంలో ఐదుమందితో కూడిన నిపుణులతో బందాన్ని ఏర్పాటు చేసి ఘటనపై నివేదిక సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ఈ మేరకు ఏడు రోజుల్లో నివేదిక సమర్పించనున్నట్టు చెప్పారు. ఇప్పటికే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందనీ, మెడికల్ కౌన్సిల్ సర్జరీ చేసిన డాక్టర్ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసిందని వివరించారు. మరణాలకు కారణాలు పరిశోధన తర్వాతే తేలుతాయని అన్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ఆపరేషన్లు, శిక్షణ నిర్వహిస్తున్నామని డీహెచ్ తెలిపారు. ఇకపై సర్జరీల సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.