Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రథమ భారత స్వాతంత్రోద్యమంలో సంచార జాతులదీ ముఖ్య పాత్ర
- ఈ జాతులపై 1871లో క్రిమినల్ యాక్ట్ ప్రయోగం
- వారికి ఇప్పటికీ అందని ద్రాక్షలా సంక్షేమం
- బాలకృష్ణ రేణుకే సిఫార్సులను తుంగలో తొక్కిన కేంద్రం
స్వాతంత్రోద్యమ చరిత్రలో తమకంటూ ప్రత్యేక పేజీలు నిలుపుకున్న సంచార జాతులు.. నేడు దీనస్థితిలోకి చేరాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఈ జాతులపై విధించిన 'క్రిమినల్ యాక్ట్' నుంచి వీరికి విముక్తి లభించి 70 యేండ్లు గడుస్తున్నా.. పేదరికం, నిరుద్యోగం నుంచి మాత్రం విముక్తి లభించడంలేదు. విద్య, ఉద్యోగాలు, ఉపాధిలో అట్టడుగున ఉన్న సంచార జాతుల సంక్షేమానికి ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ జాతులు కోరుతున్నాయి. ప్రత్యేక సంక్షేమ పథకాలు రూపొందించి ఆర్థికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించాలని అడుగుతున్నాయి.
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఓ వైపు వజ్రోత్సవాలంటూ దేశమంతా హడావుడి చేసిన కేంద్ర ప్రభుత్వం సంచార జాతులకు ఓటరు కార్డు, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. యూపీఏ1 ప్రభుత్వం దీని డీఎన్టీల సమస్యలపైన బాలకృష్ణ రేణుకే కమిటీ వేసింది. ఆ కమిటీ ప్రతిపాదించిన సిఫార్సులను అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఫలితంగా విద్య, ఉపాధి, సంక్షేమం, సామాజిక న్యాయానికి సంచార జాతులు దూరమవుతున్నాయి. ప్రథమ భారత్ స్వాతంత్ర పోరాటం 1857లో అనేకమంది బ్రిటిష్ సైన్యాన్ని హత మార్చిన ఘనత సంచార జాతులదే.. వీరు స్వాతంత్ర సమరయోధులకు సహకరిస్తూ సైనికులుగా పనిచేశారు. బ్రిటిష్ సైన్యం ఆ ఉద్యమాన్ని అణిచివేసిన తర్వాత సంచార జాతులపై క్రిమినల్ యాక్ట్ (1871) అమలు చేసింది. దీనివల్ల సంచారజాతులలోని చిన్నపిల్లలతో పాటు గర్భంలో పుట్టబోయే పిల్లలను సైతం నేరస్తు లగా పరిగణించారు. దీన్ని క్రూరమైన చర్యగా భావించి స్వాతంత్రానంతరం అప్పటి ప్రధాని నెహ్రూ 1952 ఆగస్టు 31న డినోటిఫై చేయడంతో ఆ రోజు నుంచి సంచార జాతులకు క్రిమినల్ యాక్ట్ నుంచి విముక్తి లభించింది. దాంతో ప్రతి యేటా ఆగస్టు 31వ తేదీని 'విముక్తి దివస్'గా జరుపుకుంటున్నారు. ఈ సంచార జాతులు జీవనోపాధి కోసం కుటుంబం తో కలిసి ఊరూరా తిరుగుతూ ఊరి బయట చెట్ల కింద, చిన్న గుడారాలు వేసుకుంటూ జీవనం సాగి స్తుంటారు. ఈ జాతుల్లో అనేక రకాల కళాకారులు, అశ్రిత కులాలు, బిక్షక గాయకులు, కథలు చెప్పే వారు, భాగవతుల నాటకాల ఆడేవారు, వాయిద్యకా రులు, సర్కస్, మందులోళ్ళు, పచ్చబొట్టు వారు, గారడీలు, అలాగే పాములు, కోతులు, ఎలుగు బంట్లు, ముంగిసలు, ఎద్దులు వంటి జంతువులతో ఆటలాడేవారు ఉన్నారు. వీరి జనాభా కూడా దేశ జనాభాలో తక్కువేమీ కాదు. శాశ్వత నివాసాలు లేకపోవడంతో ఊరి చివరన బ్రిడ్జిలు, డ్యాములు, మోరీలు, రోడ్లు, కాలువల పక్కన అతి దారిద్య్రంలో జీవిస్తున్నారు. వీరి స్థితిగతుల పైన ఎన్నో కమిషన్లు వేసినా అవి బుట్టదాఖలు అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 70కి పైగా ఈ సంచార జాతులుగా ఉన్నా కొన్ని జాతులకు ఇప్పటికీ కుల గుర్తింపు లేదు.
సిఫార్సులు తుంగలోకి..
యూపీఏ1-ప్రభుత్వం డీఎన్టీల సమస్యల పైన బాలకృష్ణ రేణుకే కమిటీ వేయడం జరిగింది. సుమారు 72 సిఫార్సులు చేశారు. విద్యా ఉద్యోగాల లో 10 శాతం సంచార జాతులకు రిజర్వేషన్లు దళితులకు ఇచ్చినట్టు ఇవ్వాలనీ, మానవహక్కుల కమిషన్ మరియు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో కూడా సభ్యులుగా ఉండాలనీ, వివిధ కార్పొరేషన్ నామినే టెడ్ పోస్టులు సంచార జాతులకు ఇవ్వాలనీ, తదితర అభివృద్ధికి సంబంధించిన అన్నిట్లలో సమానావకాశా లు ఇవ్వాలని బాలకృష్ణ రేణుకే కమిషన్ రెకమండేషన్ చేసింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం గత కమిషన్ సిఫారసులు అమలు చేయకుండా తుంగలో తొక్కింది. బీజేపీ ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మెన్లందరూ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళను వేసి సంచార జాతుల అభివృద్ధిని అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం సంచా రజాతుల డెవలప్మెంట్ బోర్డుకు ఒక పైసా కూడా నిధులు కేటాయించడం లేదు. పేరుకు మాత్రమే కమిషన్ చైర్మెన్లు వెల్ఫేర్ బోర్డు తప్ప నిధులు లేమితో తీవ్రమైన వివక్షను మోడీ ప్రభుత్వం చూస్తూ ఉంది. రాష్ట్రంలో కూడా ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో సంచారజాతులను చేర్చారు. ఇది కూడా అ శాస్త్రీయంగా ఉంది. సంచార జాతులు తమను సంచార జాతులుగా గుర్తించాలని పోరాడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీలుగా గుర్తించడం వదిలేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచారజాతుల జాబితాని ఎంబీసీలుగా రాష్ట్రంలో ప్రకటించి సంచార జాతుల అస్తిత్వాన్ని దెబ్బ కొట్టింది. రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌కు 1000 కోట్లు కేటాయిస్తామని, సంచార జాతులను అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాటలు మాత్రం గడప దాటలేదు.
కోరుతున్నవి ఇవే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ జాతులపై సమగ్ర సర్వేను చేసి.. విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి.. ఆర్థిక సామాజికంగా అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి తమ జీవితాలలో వెలుగు నింపాలని ఈ సంచార జాతుల ప్రజలు కోరుతున్నారు. అలాగే శాశ్వత నివాసంతో పాటు కార్మికులకు గుర్తింపు కార్డులు, చేతివృత్తులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారు. ఆయా కులాలకు అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేసి ఆ జాతుల వారికే చైర్మన్, సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలను ఏర్పాటు చేయాలని, కులాల పేర్లు తిట్టు పదాలుగా ఉన్నందున అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని వేడుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లలా డిఎన్టి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంబీసీ కార్పొరేషన్ రద్దు చేసి డీఎన్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
సంచారుల సంక్షేమానికే కృషి చేయాలి
ఆధునిక, అభివృద్ధి యుగంలోనూ తిండి, బట్ట, నీడ లేక దారిద్య్రరేఖకు చివరన జీవిస్తున్న సంచార జాతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ఆధునిక సాంకేతికతతో చేతి వృత్తులను అనుసంధానించి రుణ సౌకర్యాలు అందించి ప్రోత్సహించాలి.
-జాదవ్ శరత్
(డీఎన్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు)
10 శాతం రిజర్వేషన్ కల్పించాలి
సంచార జాతులకు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో 10 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా కల్పించాలి. సంచార జాతులు దౌర్భాగ్య జీవితాలను అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పరిష్కార మార్గాలకు కృషి చేయాలి.
- వెంకటనారాయణ, తెలంగాణ రాష్ట్ర సంచార విముక్త జాతుల అధ్యయన కమిటీ చైర్మన్