Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఓటమి కోసమే ఈ నిర్ణయం
- కాషాయ పార్టీ గెలిస్తే రాజకీయ పార్టీల మనుగడకే ప్రమాదం
- ప్రజాస్వామ్యం ఖూనీ, రాజ్యాంగ వ్యవస్థల ధ్వంసం
- మెజార్టీ ఉన్న ప్రభుత్వాలను పడగొడుతున్న మోడీ సర్కారు
- ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం
- భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు పోడుపాదయాత్ర
- రాజకీయ పరిణామాలను బట్టి సాధారణ ఎన్నికల్లో వ్యూహం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. బీజేపీని ఓడించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాషాయ పార్టీ గెలిస్తే అన్ని రాజకీయ పార్టీల మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, సీనియర్ నాయకులు నంద్యాల నర్సింహ్మారెడ్డితో కలిసి తమ్మినేని మాట్లాడారు. ఉప ఎన్నికలపై రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శివర్గంలో చర్చించి పార్టీ పొలిట్‌బ్యూరోతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మునుగోడులో బీజేపీని ఓడిస్తామనీ, టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నట్టు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించడం కుంటిసాకు మాత్రమేనని విమర్శించారు. మునుగోడు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అసలు విషయాన్ని ప్రకటించారనీ, రాజగోపాల్‌రెడ్డి గెలిచిన నెలరోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్నారని గుర్తు చేశారు. పూర్తి మెజార్టీతో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐని ప్రయోగించి ఎమ్మెల్యేలను లొంగదీసుకుంటారని విమర్శించారు. దేశవ్యాప్తంగా వక్రమార్గంలో బీజేపీ పాలన సాగుతున్నదని చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను, రాజ్యాంగ వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ, సుప్రీం కోర్టును సైతం రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివెనుక పెద్ద వ్యూహం ఉందన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ
రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని తమ్మినేని చెప్పారు. రాజకీయ పరిస్థితిలో మార్పు రావాలనీ, టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండాలంటూ కాషాయ పార్టీ కోరుకుంటున్నదని అన్నారు. అయితే మునుగోడులో ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయే అవకాశముందన్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉన్నందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. డబ్బు, బిర్యానీ, ప్రలోభాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, సేవ, సమస్యల పరిష్కారం వంటివి పక్కకుపోతున్నాయని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వచ్చాక ఆ పార్టీ శ్రేణుల్లో కొంత కదలిక వచ్చిందని చెప్పారు. మునుగోడులో మద్దతివ్వాలంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు తమను సంప్రదించారని వివరించారు. బీజేపీని ఓడించే పార్టీలకే మద్దతిస్తామంటూ చెప్పామన్నారు. అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండే అవకాశమున్నందున తాము టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్నామని వివరించారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కేసీఆర్ ఏకం చేస్తున్నారని అన్నారు. తమకు బీజేపీ ప్రధాన రాజకీయ శత్రువన్నారు. అయితే మోడీ, షా ఇతర నాయకులతో తమకు వ్యక్తిగత తగాదాల్లేవనీ, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదనీ, మత విద్వేషాలను పెంచుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు బీజేపీ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తున్నాయని అన్నారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనీ, భావప్రకటనా స్వేచ్ఛ కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం
మునుగోడు ఉప ఎన్నికల వరకే కాకుండా భవిష్యత్తులోనూ సీపీఐ, సీపీఐ(ఎం)తోపాటు లౌకిక పార్టీలతో కలిసి పనిచేస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తమ్మినేని చెప్పారు. జాతీయ స్థాయిలో ఇప్పుడే ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఫ్రంట్లు ఏర్పడి బీజేపీని నిలువరించాలని చెప్పారు. సాధారణ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయింలో ఫ్రంట్లు ఏర్పడితే బాగుంటుందని సూచించారు. గతంలో నేషనల్ ఫ్రంట్, యూపీఏ అలాగే ఏర్పడ్డాయని గుర్తు చేశారు. బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై సీపీఐతో సంప్రదించామని అన్నారు. పోటీచేసి ఓట్లు చీల్చి బీజేపీ గెలిచేందుకు మేలు చేయడం కంటే ఓడించాలన్న నిర్ణయానికి వచ్చామన్నారు. అయితే ఈ ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామంటూ సీపీఐ ప్రకటించింది కదా అన్న విలేకర్ల ప్రశ్నకు తాము మాత్రం మునుగోడు ఉప ఎన్నికల వరకే టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నామని ఆయన సమాధానమిచ్చారు. సాధారణ ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు, బీజేపీ ప్రమాదం వంటి అంశాలను బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అదే సీపీఐకి, తమకు తేడా అని అన్నారు.
సమస్యలపై పోరాటం ఆగదు
టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చినంత మాత్రాన సమస్యలపై పోరాటం ఆగదని తమ్మినేని చెప్పారు. డబుల్బెడ్రూం ఇండ్లు, అసంఘటిత కార్మికులు, కనీస వేతనాలు, వీఆర్ఏలు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు, దళితబంధు, మూడెకరాల భూమి, పోడు భూమి, నిరుద్యోగ భృతి, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, మూసీ ప్రక్షాళన వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తెస్తామన్నారు. ఎన్నికల్లో స్నేహపూర్వకంగా ఉంటూనే సమస్యలను పరిష్కరించాలని కోరతామని వివరించారు. అయితే ఆ సమస్యలను పరిష్కరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికే మంచిదనే విషయాన్ని కేసీఆర్‌కు చెప్తామని చెప్పారు. పోడు సమస్య పరిష్కారం కోసం భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు పోడు పాదయాత్ర చేపడతామని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలపై ఏయే అంశాల్లో విమర్శించామో, పరిష్కారం కోసం యుద్ధం చేశామో వాటికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెల్దార్‌పల్లిలో కృష్ణయ్య హత్యను ఖండిస్తున్నామని చెప్పారు. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హత్య చేయడం తమ పార్టీ విధానానికి వ్యతిరేకమన్నారు. ఆ హత్యకు పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మునుగోడులో చేనేత కార్మికులపై జీఎస్టీని తొలగించినా బీజేపీకి ఓటేయాలంటూ తాము చెప్పబోమనీ, చిత్తుగా ఓడించాలంటూ పిలుపునిస్తామని స్పష్టం చేశారు.
నేడు ప్రగతిభవన్‌కు సీపీఐ(ఎం) బృందం
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆహ్వానం మేరకు శుక్రవారం సాయంత్రం సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ప్రగతిభవన్‌కు వెళ్లనుంది. మునుగోడు ఉప ఎన్నికలు, దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై అక్కడ చర్చ జరగనుంది. బీజేపీని ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. అయితే సీఎం దృష్టికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సీపీఐ(ఎం) బృందం తేనుంది. వాటి పరిష్కారానికి ప్రభుత్వపరంగా నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరనుంది.