Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని రంగాల్లోనూ వైఫల్యం
- బీజేపీ సర్కారును సాగనంపాల్సిందే : బీహార్‌లో సీఎం కేసీఆర్
- నితీష్‌కుమార్‌తో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని 8 ఏండ్ల ప్రభుత్వం అన్నిరంగాల్లోనూ పూర్తిగా పాలనా వైఫల్యం చెందిందనీ, ఆపార్టీని ఇక ఇంటికి సాగనంపాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా దేశం పతనమైందని విమర్శించారు. బుధవారంనాడాయన బీహార్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో కలిసి ఉమ్మడిగా విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే ప్రతిపక్షాల కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఎన్నికల సమయంలో నిర్ణయిస్తామన్నారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం తాము పోరాడుతున్నామనీ, భావసారూప్య పార్టీలన్నీ ఒకచోటకు చేర్చే ప్రయత్నం జరుగుతున్నదని వివరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్రప్రభుత్వాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. డాలర్‌తో పోలిస్తే గతంలో ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ దారుణంగా పతనమైందన్నారు. దేశంలోని రైతులు, పేదలు, మహిళలు సహా ఎవరికీ కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. ''దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. సమద్ధిగా జలాలు ఉన్నా రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు ఆగడం లేదు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే తాగునీరు, విద్యుత్ సమస్యను పరిష్కరించ లేకపోయారు. అర్హులందరికీ ఇండ్లు ఇస్తామన్న హామీ ఏమైంది'' అని ప్రశ్నించారు. బేటీ బచావో... బేటీ పడావో.. నినాదం ఉన్నా.. అత్యాచారాలు ఆగడం లేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మంచి చేస్తే రైతులు ఎందుకు ఉద్యమిస్తారన్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదం పేరుకు మాత్రమేననీ, అనేక వస్తువులను ఇప్పటికీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలనీ, రొటీన్ ప్రభుత్వాలు కాకుండా, దేశ భవిష్యత్‌ను మార్చే ప్రభుత్వం కావాలని చెప్పారు. బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందనీ, అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసే విషయమై బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో చర్చించినట్టు తెలిపారు. ప్రజల మధ్య విద్వేషాలు సష్టించే శక్తులు దేశానికి మంచివి కావన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఎల్ఐసీ వంటి సంస్థల్ని ప్రయివేటీకరించడం ఏంటని ప్రశ్నించారు. దానితోపాటే రైల్వేలు, ఎయిర్‌పోర్టులు సహా అన్నింటి ని ప్రయివేటుకు ఇచ్చేస్తున్నారని చెప్పారు. ప్రధాని మోడీ ఇచ్చిన రైతుల ఆదాయం రెట్టింపు హామీ ఏమైందన్నారు. బీహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా బీజేపీ ముక్త్ భారత్‌ను కోరుకుంటున్నారని చెప్పారు.
మా రాష్ట్రాభివృద్ధిలో మీ పాత్ర గొప్పది
తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో బీహార్ ప్రజల పాత్ర గొప్పదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. గాల్వాన్ లోయలో దేశ రక్షణ కోసం అసువులు బాసిన అమర సైనికుల త్యాగం చిరస్మరణీయమని నివాళులు అర్పించారు. బుధవారంనాడాయన బీహార్‌లో పర్యటించారు. అక్కడి ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం గాల్వన్ లోయలో అసువులు బాసిన అమర సైనికుల కుటుంబాలకు, హైదరాబాద్ బోయిగూడ అగ్ని ప్రమాదంలో మరణించిన బీహార్ వలస కూలీల కార్మిక కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయాన్ని అంద చేశారు. అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరి కీ చేరాలనీ, దీనివల్ల సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో బీహార్ కు చెందిన వేలమంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందిస్తున్నా రు. అనేక రంగాల్లో వీరు పని చేస్తున్నారని తెలి పారు. కరోనా టైంలో కేంద్రప్రభుత్వం వలస కూలీల ను ఆదుకొనేందుకు ఏమాత్రం ముందుకు రాలేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి నందరినీ తమ సొంత రాష్ట్ర బిడ్డలుగానే చూసు కుంటామని చెప్పారు. ఈ సందర్భంగా జవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షలు, వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కూడా పాల్గొన్నారు.
లాలూకు పరామర్శ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట, లాలూ కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు.