Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త సీపీఎస్ వ్యతిరేక పోరాటానికి సీఎం నాయకత్వం వహించాలి
- పెన్షన్ విద్రోహదినం సందర్భంగా యూఎస్పీసీ డిమాండ్
- ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్రవ్యాప్త నిరసనలు
నవతెలంగాణ- విలేకరులు
బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చందాతో కూడిన పింఛను విధానాన్ని రాష్ట్రంలో రద్దు చేసి, దేశవ్యాప్తంగా సీపీఎస్ రద్దు కోసం జరిపే పోరాటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. యూఎస్పీసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ విద్రోహదినం పాటించారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరుతూ సంఘాలకు అతీతంగా ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. విరామ సమయంలో పాఠశాలల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సాయంత్రం కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించి జిల్లా కలెక్టర్లకు మెమోరాండాలు అందజేశారు. యూయస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆయా జిల్లాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్దరించాలని కోరుతూ హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించారు. ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్‌తో విధులకు హాజరై మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలుచోట్ల టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శారద, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీటీఏ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ నాయక్ మాట్లాడారు. 30 ఏండ్లకుపైగా సేవచేసిన వారికి కనీస హక్కుగా పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కానీ ఎవరైనా ఉద్యోగి మరణానంతరం.. సీపీఎస్ వల్ల ఆ కుటుంబం మనుగడ సాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు కోసం జరిగే పోరాటంలో అన్ని సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో అబిడ్స్‌లోని జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి డిస్ట్రిక్ రెవెన్యూ అధికారి(డీఆర్వో) సూర్యలతకి వినతిపత్రం అందజేశారు.
మంచిర్యాలలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దండేపల్లిలో తహసీల్దార్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. ఉట్నూర్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన తెలిపారు. సిరికొండ మండలం రాయిగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో భోజన విరామ సమయంలో పెన్షన్ విద్రోహ దినంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో డీఆర్సీ ముందు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో టీఎస్‌యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. శంకర్పల్లి మండలంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. తాండూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కొడంగల్‌లో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో ఆందోళన చేశారు.
సూర్యాపేట జిల్లా మునగాల, ఆత్మకూర్‌ఎస్, నూతనకల్, కోదాడ మండలాల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు పెట్టుకుని భోజన విరామసమయంలో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వినతిపత్రాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్˜్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం, బోనకల్లో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం, ఆళ్లపాడు, మణుగూరు మండలాల్లో యూటీఎఫ్, టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
టీఎస్ యూటీఎఫ్, టీఎస్ పీఆర్టీయూ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. నారాయణపేట కలెక్టరేట్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పెన్షన్ విద్రోహదినంగా పాటించినట్టు ములుగు జిల్లా మంగపేటలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గొప్ప సమ్మారావు తెలిపారు. హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి పెండెం రాజు ఆధ్వర్యంలో, నడికూడలో భోజన విరామసమయంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం ప్రభుత్వ పాఠశాలలో యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి ముద్దు కృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో యూఎస్పీసీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. పాఠశాలల్లో భోజన విరామ సమయంలో ఆందోళన చేశారు. తహసీల్దార్లకు వినతిపత్రం ఇచ్చారు. సిరిసిల్లలో ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల, సిరిసిల్లలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.