Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాసిరకంగా చెక్ డ్యామ్ నిర్మాణం
- వరద తాకిడికి నాలుగు ముక్కలు
నవతెలంగాణ-మల్హర్రావు
భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లోని మల్హర్రావు మండలం మల్లారం మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్ నిర్మాణంలో లొసుగులు బయటపడుతున్నాయి. చెక్‌డ్యామ్ డిజైన్, పనుల్లో నాణ్యత లోపించించడంతో నాలుగు ముక్కలైంది. ఇరిగేషన్ అధికారుల పర్యావేక్షణ లేకపోవడం వల్లనే కాంట్రాక్టర్ నాసిరకమైన పనులు చేయడంతో చెక్‌డ్యామ్ ముక్కలై నీరు నిలవడం లేదు. దాంతో రూ.16.62 కోట్ల ప్రజాధనం నీటిపాలైంది. కాంట్రాక్టర్‌పైనా, ఇరిగేషన్ అధికారులపైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో మల్లారం గ్రామపంచాయతీ పరిధిలో మొదటిసారిగా రూ.8 కోట్లతో 2021 మేలో చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత తేలికపాటి వరద తాకిడికి చెక్‌డ్యామ్ 16 ముక్కలైంది. అధికారులు రీడిజైన్ కోసం రూ.16.62 కోట్లు మంజూరు చేసి ఈ ఏడాది మేలో నిర్మాణ పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ రెండోసారి కూడా నాసిరకంగా చేపట్టడంతో బుధ, గురువారాల్లో కురిసిన వరద తాకిడికి చెక్‌డ్యామ్ సైడ్ వాల్స్ కుంగిపోయాయి. దాంతోపాటు మానేరుపై నిర్మించిన చెక్‌డ్యామ్ నాలుగు ముక్కలైంది. ఈ క్రమంలో దాదాపు మొత్తం రూ.24 కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగమైంది.
ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : మల్హర్రావు, ఎంపీపీ
చెక్‌డ్యామ్ కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు, నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా నిర్మించడం తో రూ.16.62 కోట్ల ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది. బాధ్యుడైన కాంట్రాక్టర్‌పైనా, ఇరిగేషన్ అధికారులపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టాలి.
క్వాలిటీ అధికారులకు రిఫర్ చేసి పూర్తి విచారణ చేస్తాం : బలరామయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్ శాఖ
మంథని నియోజకవర్గంలో మానేరుపై ఇప్పటికే 16 చెక్‌డ్యామ్‌లు నిర్మించాం. చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులు చివరి దశల్లో ఉన్నాయి. ఎక్కడా ఇలా జరగలేదు. మల్లారం చెక్‌డ్యామ్ ముక్కలైన విషయం తెలియడంతో చెక్‌డ్యామ్‌ను పరిశీలించాము. పగుళ్లపై పూర్తి విచారణ చేస్తాము. నిర్మాణ పనుల్లో, డిజైన్‌లో లోపాలుంటే క్వాలిటీ అధికారులకు రిఫర్ చేస్తాము. సైడ్ వాల్స్ అడుగు భాగంలో కాంట్రాక్టర్ బైండింగ్ మట్టి పోయకపోవడంతో పక్కనున్న పొలాలు కోతకు గురయ్యాయి. కాంట్రాక్టర్ నుంచి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తాము. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం.