Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వే నంబరు 288లో వెలసిన ఎర్ర జెండాలు
- వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండాలు పాతిన పేదలు
నవతెలంగాణ-హసన్పర్తి
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను బయటికి తీసి సర్వే నెంబరు 288లోని కోడికుంట చెరువు 18 ఎకరాల భూమిలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల్లు నిర్మాణం చేసి పేదలకు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా శివారులోని పెగడపల్లి గ్రామ సమీపంలోని సదరు భూముల్లో వ్యవసాయ కార్మికులు, ఇతర పేదలతో కలిసి ఎర్ర జెండాలు పాతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామన్న వాగ్దానం అమలు కాలేదన్నారు. గత ఎన్నికల్లో సొంత ఇంటి స్థలం ఉన్న వాళ్లకు రూ.5.50లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మాట మార్చిందన్నారు. కేవలం రూ.3.50 మాత్రమే ఇస్తామని ప్రకటించిందని తెలిపారు. ఇండ్ల స్థలాలు లేనటువంటి పేదల గురించి ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఒక వైపున ప్రభుత్వ భూములు, చెరువు శికాలను అధికార ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆక్రమించుకొని వెంచర్లు వేసినా అధికారులు, జిల్లా మంత్రులు చూసి చూడనట్టు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ఇప్పటికే పేదలు ఆక్రమించుకొని గుడిసెలు వేసుకొని ఉన్న ఇండ్లకు పట్టాలిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం కోసం రూ.5.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు లేవని చెప్పే ప్రచారాన్ని ఎండగట్టడం కోసమే ప్రభుత్వ భూముల్లో జెండాలు పాతి గుడిసెలు వేస్తున్నామని చెప్పారు. తక్షణమే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆక్రమించినటువంటి భూములను జిల్లా కలెక్టర్ స్వాధీనం చేసుకొని పేదల ఇండ్ల స్థలాల కింద ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిరాజుల రాములు, వేల్పుల రవి, గబ్బెట సతీష్, జూకంటి పద్మ, పెండెల రవి, గోల్కొండ కుమార్ పాల్గొన్నారు.