Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం అరాచకం
- విద్యార్థులకు ప్రిన్సిపాల్ బెదిరింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్న కెఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం అరాచకం సృష్టిస్తున్నది. విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తున్నది. గురువారం నాటికి ఫీజు కట్టకపోతే సీటు రద్దవుతుందంటూ కెఎల్ఈఎఫ్ ప్రిన్సిపాల్ సంతకం చేయడం సంచలనంగా మారింది. దీంతో అక్కడ చదివే విద్యార్థులు భయాం దోళనలకు గురవుతున్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటాసైన్స్ (ఏఐడీఎస్) కోర్సు ఫీజు సెమిస్టర్‌కు రూ.1,32,500, ఏడాదికి మెరిట్ ఫీజు రూ.2.65 లక్షలు, ఏడాదికి పూర్తి ఫీజు రూ.2.80 లక్షలు, బీటెక్ ఈసీఈ కోర్సు ఫీజు మెరిట్ సెమిస్టర్ ఫీజు రూ.1,22,500, ఏడాదికి మెరిట్ ఫీజు రూ.2.45 లక్షలు, ఏడాదికి పూర్తి ఫీజు రూ.2.60 లక్షలు వసూలు చేస్తున్నట్టు ఆ విశ్వవిద్యాలయం ప్రకటించింది. వాటికి అదనంగా రవాణా ఫీజు రూ.38 వేలు చెల్లించాలి. అయితే ఓ విద్యార్థి రూ.50 వేలు చెల్లించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో ఏప్రిల్ 24న ప్రవేశం పొందారు. అప్పటి నుంచి తరగతులకు హాజరవుతున్నారు. అయితే మిగతా ఫీజు కట్టలేదనీ, గురువారం చెల్లించకుంటే సీటు రద్దవుతుందంటూ ప్రిన్సిపాల్ లెటర్‌పై సంతకం చేసి ఆ విద్యార్థి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఇటీవల కార్పొరేట్ నారాయణ జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థిని ఫీజులుంకు యాజమాన్యం పాల్పడితే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ ఘటన మరువక ముందే కెఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం యాజమాన్యం ఫీజుల కోసం విద్యార్థులను వేధింపులకు గురిచేయడం గమనార్హం. అయితే ఆ వర్సిటీ నిబంధనలను తుంగలో తొక్కుతున్నది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో కెఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. అయితే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతులను అజీజ్‌నగర్‌లో, రెండో ఏడాది తరగతులను మియాపూర్‌లో, ఎంబీఏ తరగతులను మాత్రం కొండాపూర్ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఒకే దగ్గర తరగతులను నిర్వహించాల్సిన ఆ వర్సిటీ వేర్వేరు ప్రాంతాల్లో జరగడం నిబంధనలకు విరుద్ధమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
టీఎస్టీసీఈఏ ఖండన
ఫీజు కట్టకుంటే సీటు రద్దు చేస్తామంటూ కెఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ బెదిరించడాన్ని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయివేటు విద్యాసంస్థలు ఫీజుల కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని కోరారు. గురువారం ఒక్క రోజే కట్టకపోతే సీట్ రద్దవుతుందంటూ చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యార్థుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడం సరైంది కాదని తెలిపారు. ఆ ప్రిన్సిపాల్ వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను బెదిరిస్తే కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.