Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలి
- పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయండి
- 14,15,16 తేదీల్లో కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభ
- వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశంలో విద్యారంగం కార్పొరేటీకరణ, కాషాయీకరణ, వ్యాపారీకరణకు ఊతం ఇస్తున్న నూతన జాతీయ విద్యావిధానాన్ని(ఎన్ఈపీ) రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్ మూర్తి, కార్యదర్శి పి.నాగరాజు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభ వాల్ పోస్టర్ను గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కే హాల్లో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 14,15,16 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర 4వ మహాసభను జయపద్రం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి.. యూనివర్సిటీల నుంచి 800 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు తెలిపారు. రాష్ట్ర విద్యారంగ సమస్యల పరిష్కారంపై సభలో చర్చించి పలు తీర్మానాలు చేస్తామని, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ గురుకులాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. 1482 గురుకులాలు అద్దె భవనాల్లో, కనీస వసతులు లేకుండా నడుస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. గురుకులాల్లో ఎలుకలు, పాములు ఉంటున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో కారేపల్లి ట్రైబల్ గురుకులంలో విద్యార్థులను ఎలుకలు కొరకడం, సంగారెడ్డిలో విద్యుత్ షాక్తో విద్యార్థి మృతిచెందడం వంటి ఘటనలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. రెండు నెలల కాలంలో 9 మంది విద్యార్థులు మృతిచెందారని, బాసర ఐఐఐటీ, గురుకులాలు, కేజీబీవీలలో తరచూ ఫుడ్ పాయిజన్ అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, విద్యార్థుల మెస్ చార్జీలు దారుణంగా ఉన్నాయని చెప్పారు. కాస్మోటిక్ చార్జీలతోపాటు పెండింగ్లో ఉన్న రూ.3720 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు రాలేదని కళాశాల సర్టిఫికెట్స్ ఇవ్వడానికి నిరాకరించడంతో మంచిర్యాల జిల్లా జన్నారం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజులు విడుదల చేయాలని కోరారు. యూనివర్సిటీలలో ఫ్రొఫెసర్, అసిస్టెంట్ ఫ్రొఫెసర్, నాన్ టీచీంగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అడ్డగోలుగా ఫీజులు
పెంచి డొనేషన్లు తీసుకుని, లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తున్న ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 24 వేల ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని.. ప్రయివేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్య క్షులు ఎండి.జావేద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి శంకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.అశోక్ రెడ్డి, బి.వెంకటేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు శ్రీమాన్ పాల్గొన్నారు.