Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరుస ఘటనలు జరుగుతున్నా మేల్కోని కేంద్రం
- కుటుంబ నియంత్రణ శిబిరాల్లో వీడని నిర్లక్ష్యం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మొదటిసారి తప్పు జరిగితే అనుభవం లేక జరిగిందని సరిపెట్టుకోవచ్చు. కానీ అలాంటి తప్పు మళ్లీ మళ్లీ జరుగుతుంటే అలాంటి ఘటనలకు అనుభవరాహిత్యం కాకుండా మరో కారణం ఉందని అర్థం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు సంబంధించి వరస అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నా సమస్యకు మూలాలను సరిచేయకపోవడాన్ని అత్యంత బాధ్యాతారాహిత్యంతో కూడిన నిర్లక్ష్యమనే చెప్పాలి. ఇటీవల ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రిలో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల శిబిరంలో శస్త్రచికిత్స చేయించుకున్న మహిళల్లో నలుగురు మరణించగా.. పలువురు ఇప్పటికీ చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది మొదటి ఘటన కాకపోవడం గమనార్హం. 2014 నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన శిబిరంలో శస్త్రచికిత్స తర్వాత 13 మంది మహిళలు చనిపోయారు. అంతకు ముందు 2010-13 మధ్య కాలంలో ఆపరేషన్ల తర్వాత దేశవ్యాప్తంగా 363 మంది ప్రాణాలొదిలారు.
ఛత్తీస్‌గఢ్ ఘటన తర్వాత దీనిపై అక్కడి రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ విచారణ కొనసాగింది. ప్రజారోగ్య పరిరక్షణ కార్యకర్త దేవికా బిస్వాస్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసి న్యాయపోరాటం చేశారు. దీని ఫలితంగా 2016లో సుప్రీంకోర్టు అలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రానికి మార్గదర్శకాలను జారీచేసింది. జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం సజావుగా జరిగేలా ఈ మార్గదర్శకాలున్నాయి. అయితే వీటి అమలుపట్ల శ్రద్ధ కనబరచకపోవడమే ఇలాంటి శిబిరాల్లో మరణాలు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. శిబిరాల్లో భాగస్వాములతో పాటు అన్ని రాష్ట్రాల ప్రోగ్రాం మేనేజర్లు, జిల్లా ప్రోగ్రాం మేనేజర్లతో వర్క్‌షాపులు నిర్వహించాలి. శిబిరాలు నిర్వహించే ఆరోగ్య కేంద్రాల్లో కనీసం రెండింటితో పాటు ఒక అక్రిడియేటెడ్ ప్రయివేటు లేదా స్వచ్ఛంద సంస్థ నిర్వహణలోని కేంద్రాన్ని ప్రతి నెల రాష్ట్ర క్వాలిటీ అస్యూరెన్స్ కమిటీ లేదా జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ కమిటీ తప్పనిసరిగా పర్యవేక్షించాలి. కమిటీలను బలోపేతం చేస్తూ స్టెరిలైజేషన్ లోపాల కారణంగా జరుగుతున్న మరణాలను నిశితంగా పర్యవేక్షిస్తూ సమీక్షించాలని కోర్టు సూచించింది. ఆపరేషన్ తర్వాత కూడా సమస్యలు తలెత్తకుండా లబ్దిదారుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని కేంద్రానికి సలహా ఇచ్చింది. మెటర్నల్, చైల్డ్ హెల్త్ ట్రాకింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ (ఎంసీటీఎఫ్ సీ) ద్వారా ఈ సేకరణ జరగాలని సూచించింది. ముఖ్యంగా ఒక సర్జన్ ఒక రోజులో 30 శస్త్రచికిత్సలకు మించి చేయకుండా పరిమితి విధించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం శిబిరాలు నిర్వహించే ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర క్వాలిటీ అస్యూరెన్స్ కమిటీ లేదా జిల్లా అస్యూరెన్స్ కమిటీ తప్పనిసరిగా రెగ్యులర్‌గా పర్యవేక్షించాల్సి ఉన్నది. అయితే తాజాగా రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఘటనలో స్టెరిలైజేషన్ సరిగ్గా చేయకపోవడం, స్థానికంగా లభిస్తున్న నీటిలో స్టెఫిలోకోకస్ బాక్టీరియా ఉండటం, ఆపరేషన్ కోసం వాడిని పరికరాలను సరిగ్గా స్టెరిలైజ్ చేయకపోవడంతో మహిళలు ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలుస్తున్నది. తాజా ఘటనపై విమర్శలు పెరిగిపోవడంతో స్థానిక సూపరింటెండెంట్, డాక్టర్ ను సస్పెండ్ చేశారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావతంగా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంలో స్పష్టత లేదు. శిబిరాలకు బదులుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలను పెంచి స్థానిక డాక్టర్ పర్యవేక్షణలో ఆపరేషన్లు చేస్తే బాగుంటుందని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. తద్వారా స్థానికంగా ఉండే సౌకర్యాలతో పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్ కోసం తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు మరింత వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. రెగ్యులర్ వర్క్‌షాప్ లు, శిక్షణ ఇవ్వటంతో పాటు క్వాలిటీ అస్యూరెన్స్ కమిటీల పర్యవేక్షణ పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.