Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ-హసన్పర్తి
పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలివ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హసన్పర్తి మండల కేంద్రంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో పేదలకు ఇండ్ల పట్టాలివ్వాలని కోరుతూ గుమ్మడిరాజుల రాములు అధ్యక్షతన జిల్లా సదస్సు నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో సుదర్శన్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలను బెదిరించి కబ్జాదారులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష ఇండ్లు నిర్మించి పేదలకు ఇస్తామని వాగ్దానం చేసి మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసి చేతులెత్తేసిందని ఆరోపించారు. ఇండ్లు ఇవ్వకపోగా ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలపైకి పోలీసులు, రెవెన్యూ అధికారులను ఉసిగొలిపి తొలగించడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం భూ చట్టాల్లో మార్పులు తెచ్చి పేదలకు అన్యాయం చేసి బడా కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టడానికి సిద్ధపడటం దారుణమని తెలిపారు. కిరాయిలు, నిత్యవసర వస్తువుల ధరలు, వంటగ్యాస్, నూనె పెద్ద ఎత్తున పెరగడం వల్ల పేదల బతుకులు దినదిన గండంగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. ధరలను నియంత్రించకపోగా.. నిత్యావసర వస్తువులపై భారీగా జీఎస్టీ పెంచి ప్రజాధనాన్ని దోచుకోవడానికి కేంద్రం సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేకపోయినా కొత్త మండల కేంద్రాలు, మున్సిపల్, నగర పంచాయతీలు ప్రకటించి వాటికి ఐదు కిలోమీటర్ల నుంచి పది కిలోమీటర్ల వరకు ఎలాంటి ఇండ్ల స్థలాలు ఇవ్వొద్దని ప్రత్యేక జీవోలను తీసుకురావడం ఆందోళనకనమన్నారు. తక్షణం ఈ జీవోలను రద్దుచేసి పేదల అక్రమంలో ఉన్న ప్రభుత్వ భూములను ఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం రూ.5.50 లక్షలు ఇవ్వాలని కోరారు. పోలీసులు, అధికారుల బెదిరింపు నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సదస్సులో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, తెలంగాణ ప్రజాసంఘాల పోరాట కమిటీ జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి, సంఘం జిల్లా నాయకులు వాసుదేవరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చుక్కయ్య, బొబ్బెడ సతీష్, పుల్ల అశోక్, పెండ్యాల రవి, దేవరకొండ రమేష్, చిలక రాఘవులు, తదితరులు పాల్గొన్నారు.