Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో నిఘా పెంచిన పోలీసులు
- జాతీయ సంస్థలతో సమన్వయం చేసేందుకు పోలీసుల కసరత్తు
- రోజుల తరబడి ఇతర రాష్ట్రాల్లో విచారణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా విస్తరించింది.. డ్రగ్స్ నివారణపై ప్రత్యేక నిఘా పెట్టిన రాష్ట్ర పోలీసులు దాని మూలాలపై దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ కలిగివున్న డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయి లేకుండా చేయాలని పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నగర సీపీ సీవీ ఆనంద్ నగర కమిషనరేట్ పరిధిలో 'హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్' వింగ్‌లను ఏర్పాటు చేశారు. ఈ విభాగం డార్క్‌నెట్‌తోపాటు ఇతర సంస్థలపై దృష్టి సారించింది. దేశంలోని ఏ మూలనుంచైనా డ్రగ్స్ సరఫరా కాకుండా నివారించేందుకు పనిచేస్తోంది. ఈ వింగ్ కొద్ది నెలల్లోనే 58 కేసులు బుక్ చేసింది. 285 మందిని అరెస్టు చేసింది.
దాంతో డ్రగ్స్ స్మగ్లరు గోవా, ముంబయి, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అడ్డావేశారు. వారు నగరానికి రాకుండా ఇక్కడి ఏజెంట్లనే ఇతర రాష్ట్రాలకు రప్పించుకుని డ్రగ్స్ అందజేస్తున్నట్టు తెలిసింది. దర్యాప్తులో భాగంగా రాష్ట్ర పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు స్థానిక పోలీసులు సహకరించడం లేదు. దాంతో రోజుల తరబడి అక్కడే నిఘా వేస్తున్న నగర పోలీసులకు ఒకరిద్దరు స్మగ్లర్లు మాత్రమే చిక్కుతున్నారు. గోవాలో నరేంద్రా ఆర్యాను అరెస్టు చేశారు. దాంతో గోవా పత్రికలు అక్కడి పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచురించాయి. గోవా వార్తా పత్రికలు తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపించినట్టు వార్తలు వచ్చాయి.
జోరుగా చీకటి వ్యాపారం
గోవా, ఢిల్లీ, ముంబయి, రాజస్థాన్, బెంగళూరు తదితర రాష్ట్రాల్లో అడ్డావేస్తున్న నైజీరియన్లతోపాటు స్థానిక స్మగ్లర్లు దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎల్ఎస్డీ, ఎండీఎంఏ, చరస్, ఎక్స్టసీ వంటి మాదక ద్రవ్యాలను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. బీటెక్, ఇంజినీరింగ్ వంటి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలను, యువతను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. కోడ్ భాషలో ఐడీలు క్రియేట్ చేసుకుని డ్రగ్స్ వివరాలు, వాటి రేట్లను ప్రదర్శిస్తున్నారు. ఎక్కడా పోలీసులకు చిక్కకుండా కొరియర్లో సరఫరా చేస్తున్నారు. ఒకసారి మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారే తర్వాత డ్రగ్స్ సరఫరాదారులుగా, ఏజెంట్లుగా మారుతున్నారు. ఇలాంటి తరుణంలో జాతీయ సంస్థల సమన్వయంతోనే డ్రగ్స్ స్మగ్లర్లను కట్టడి చేయగలమని ఆలోచనకు వచ్చిన హైదరాబాద్ నగర సీపీ గత అనుభవాలతో డీఆర్ఐ, ఎన్సీబీలాంటి జాతీయ దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేస్తున్నారు.
టోనీ... స్టార్‌బాయ్... ఆర్య
హర్యానాకు చెందిన నరేంద్ర ఆర్య గోవాలో డ్రగ్స్ మాఫియాకు సూత్రధారిగా మారాడు. పోలీసులు దాడి చేయకుండా భారీ భద్రత, అందుకు తోడుగా మేలిమి జాతి కుక్కలతో కాపలా ఏర్పాటు చేసుకున్నాడు.
అలాంటి అడ్డాపై హైదరాబాద్ పోలీసులు ధైర్యంగా దాడి చేశారు. గోవా పోలీసులు సహకరించకున్నా కింగ్‌పిన్‌కు బేడీలు వేశారు. డ్రగ్స్ డాన్లుగా పేరొందిన స్టార్ బాయ్, టోనీలను అరెస్టు చేసేందుకు కొద్ది నెలల కిందట ముంబయి, ఢిల్లీలో ప్రయత్నించిన మన పోలీసులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయినా, ఐదారు కిలోమీటర్లు ఛేజింగ్ చేసి వేర్వేరు చోట్ల వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన స్మగ్లర్లను పట్టుకునే సమయంలో పోలీసులు త్రీవంగా శ్రమించాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు పోలీసులకు గాయాలవుతున్నాయి. నిందితులు కాల్పులకు సైతం దిగితుండటం ఆందోళన కలిగిస్తోంది.
కోట్లలో కొరియర్స్ సీవీ ఆనంద్- హైదరాబాద్ సీపీ
రోజుకు కోట్లలో కొరియర్స్ వస్తున్నాయి. కొరియర్స్‌లో డ్రగ్స్ వచ్చే అవకాశముంది. తల్లిదండ్రులు ఇంటికి వస్తున్న కొరియర్, పార్సిళ్లను విప్పి పరిశీలించాలి. కొరియర్ సంస్థలు ప్రత్యేకంగా స్క్యానర్లను ఏర్పాటు చేసుకుని పరిశీలించాలి. తల్లిదండ్రులు సైతం బాధ్యతగా వ్యవహరించి పిల్లలను రక్షించుకోవాలి.