Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌పై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఆగ్రహం
- ప్రధాని ఫొటో చింపితే.. చట్టపరమైన చర్యలు
- బీజేపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హెచ్చరిక
నవతెలంగాణ-బీర్కూర్(నసురుల్లాబాద్)
రేషన్ దుకాణాల ద్వారా కేంద్ర ప్రభుత్వమే బియ్యం సరఫరా చేస్తున్నా ప్రధానమంత్రి ఫొటో ఎందుకు పెట్టలేదని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కలెక్టర్‌ను ప్రశ్నించారు. ప్రతి కిలో బియ్యంపై రూ.35 ఖర్చవుతుంటే.. కేంద్రమే రూ.29 భరిస్తోందన్నారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు హాజరైన కేంద్ర మంత్రి.. బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఓ రేషన్ దుకాణాన్ని సందర్శించారు. పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత శాతం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ సమాధానం చెప్పకపోవడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కిలో బియ్యంపై రూ.35 ఖర్చవుతుంటే.. కేంద్రమే రూ.29 భరిస్తోందన్నారు. కేంద్ర మంత్రి ముందే ఓ రేషన్ డీలర్ లబ్దిదారుడిని బెదిరించినట్టు మాట్లాడటంతో ఆమె జోక్యం చేసుకుని డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 2020 మార్చి నుంచి ఉచిత బియ్యాన్ని కేంద్రం పంపిణీ చేస్తోందని రవాణా, గోదాం ఖర్చులను భరించి ప్రజలకు బియ్యాన్ని ఇస్తున్నప్పుడు రేషన్ దుకాణంలో ప్రధాని మోడీ ఫొటో లేకపోవడమేంటని ప్రశ్నించారు. మరోసారి తాను వచ్చేటప్పటికి ప్రధాని ఫొటో ఉండాలని ఆదేశించారు. రేషన్ లబ్దిదారులతో మంత్రి మాట్లాడారు. సరైన సమయంలో బియ్యం పంపిణీ చేస్తున్నారా.. ఇతర వస్తువులపై అదనంగా డబ్బులు వసూల్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అర్హులందరికీ పక్కాగా పౌరసరఫరాలు అందేలా చూడాలని సూచించారు.
రేషన్‌షాపుల్లో మోడీ ఫొటో పెట్టాలని కార్యకర్తలకు పిలుపు
రేషన్ దుకాణాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఫొటో పెట్టాలని, దాని కింద కేంద్రప్రభుత్వమే ఉచిత బియ్యం ఇస్తుందని రాయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వర్ని, బాన్సువాడ మండల కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఆ పార్టీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కరోనా కాలం నుంచి పూర్తి ఖర్చులతో ఉచిత రేషన్ బియ్యం లబ్దిదారులకు ఇస్తున్నామని, అందుకు కిలో బియ్యానికి రూ.30 కేంద్రం భరించగా, రూ.4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అయినా మోడీ ఫొటో పెట్టకుండా కేసీఆర్ ఫొటో పెడుతున్నారని ఆరోపించారు. మోడీ ఫొటో పెడితే చింపేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, అలాచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిత్యావసర ధరలు తగ్గించాలి : కేంద్ర మంత్రిని అడ్డుకున్న కాంగ్రెస్
నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు కేంద్ర మంత్రిని అడ్డుకున్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆమె కాన్వారును కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. దాంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరగడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గమనించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని యువజన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.