Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బియ్యం మొత్తం ఇస్తున్నట్టు ఇంతగా దిగజారుతారా..
- బియ్యం పంపిణీకి ఏటా రూ.3620 కోట్లు ఖర్చు చేస్తున్నాం
- రాష్ట్ర నిధులే కేంద్రానికి వెళ్తున్నాయి
- కేంద్రమే కేసీఆర్ ఫొటో పెట్టాలి : కేంద్రమంత్రిపై హరీశ్‌రావు ఆగ్రహం
నవతెలంగాణ- తూప్రాన్ రూరల్/మనోహరాబాద్
'దేశానికి ఎందరో ప్రధానులు పనిచేశారు. ఎవరి ఫొటోలనూ రేషన్ షాపుల్లో పెట్టలేదు. ఎప్పుడూ ఇలా చేయలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి మోడీ ఫొటో పెట్టాలన్నారు. ప్రధాన మంత్రి పదవి స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడతారా' అని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. పేదలకు ఇచ్చే ఉచిత రేషన్ బియ్యం పూర్తిగా కేంద్రమే ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకోవడం తగదన్నారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా తూప్రాన్‌లో విలేకరులతో మాట్లాడారు. రేషన్‌షాపుల్లో ప్రధాని ఫొటో పెట్టాలని అంటున్నారనీ, బియ్యం మొత్తం కేంద్రమే ఇస్తున్నట్టు ఇంతగా దిగజారేలా మాట్లాడొద్దని హితవు పలికారు. కేంద్రం 55శాతం ఖర్చు భరించినా, అందులోనూ రాష్ట్రం వాటా ఉందన్నారు. మిగిలిన 45శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.3610 కోట్లు రేషన్ బియ్యం కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. దేశాన్ని పోషిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటనీ, రాష్ట్రం నిధులే కేంద్రానికి వెళ్తున్నాయనీ, అలాంటప్పుడు కేంద్రం కూడా సీఎం కేసీఆర్ ఫోటో పెట్టామంటారా? అని కేంద్రమంత్రిని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ చేరలేదన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలను హరీశ్‌రావు తప్పు పట్టారు. అలాగని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. లేదంటే ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరి ఉంటే మీరు రాజీనామా చేస్తారా? అంటూ కేంద్ర మంత్రిని సవాల్ చేశారు ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ చేరిందా? లేదా? అని 4-2-2022లో పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న వేయగా.. దీనికి సమాధానంగా 18-5-2021లో తెలంగాణ ఆయుష్మాన్ భారత్‌లో చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ గుర్తు చేశారు. ఈ విషయంలో అబద్దాలు చెప్పిన నిర్మలా సీతారామన్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని అసత్యాలు మాట్లాడారని..ఏయే పథకం మార్చామో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు బంధు కేంద్రం పెట్టిందా..రాష్ట్రం పెట్టిందా? అని నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించారు. రైతు బీమాలో కేంద్రానికి ఒక్క రూపాయన్నా ఉందా? అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత కరెం టును కాపీ కొట్టా మా? అని ప్రశ్నిం చారు. 'కేసీఆర్ కిట్ లో మీ భాగస్వామ్యం ఉందా? ఎందుకు మీ స్థాయి తగ్గించు కుంటున్నరు' అని ప్రశ్నించారు. ప్రధాని గజ్వేల్‌లో స్వయానా నల్లా తిప్పి మిషన్ భగీరథను ప్రారం భించారని, దాన్ని కేంద్రం కాపీకొట్టి 'హర్ ఘర్ కో జల్' అని మార్చేసిందన్నారు. బీజేపీ మంత్రులు అర్ధ సత్యాలు, అవాస్తవాలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ అదేవిధంగా వ్యవహరించారని అన్నారు.
మన ఊరు- మన బడి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా అమలుకావడం లేదని చెబుతున్న నిర్మలాసీతారామన్..ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలు కావడం లేదో సమాధానం చెప్పాలన్నారు.