Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 నుంచి 18 వరకు వజ్రోత్సవాలు
- 17న ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగసభ
- పోడు భూములపై జిల్లాల్లో సమన్వయ సమావేశాలు
- ప్రతి నియోజకవర్గంలో మరో 500 మందికి దళితబంధు
- జీహెచ్ఎంసీ, మున్సిపాల్టీల్లో కోఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు
- మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా ప్రకటిస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యి సెప్టెంబర్ 17 నాటికి 75 ఏండ్లవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16 నుంచి 18 వరకు 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు' నిర్వహించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమానికి 2022 సెప్టెంబర్17 నాటికి 75 ఏండ్లలోకి అడుగిడుతున్న నేపథ్యంలో ఆ రోజును 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినం' గా పాటిస్తూ, 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల' ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. వజ్రోత్సవాల ముగింపు వేడుకలను వచ్చే ఏడాది (2023) సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో నిర్వహించాలని కూడా మంత్రివర్గం తీర్మానించింది. ఈనెల 16వ తేదీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలనీ, 17న సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్లో జాతీయజెండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయజెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించింది. అదేరోజు (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం హైద్రాబాద్ లోని బంజారాభవన్, ఆదివాసీభవన్‌లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ఊరేగింపు ఉంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తారు. 18వ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానాలు, కవులు, కళాకారులకు సత్కారాలు చేస్తారు. అలాగే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ స్పూర్తిని చాటేలా సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది.
దళిత బంధు లబ్దిదారుల పెంపు
రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం 100 మందికి దళితబంధు అందచేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో లబ్దిదారుల సంఖ్యను ఒక్కో నియోజకవర్గంలో 500కు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిగిలిన 118 నియోజక వర్గాల్లో కూడా దళితబంధు లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.
కో ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు
జీహెచ్ఎంసీతో పాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. జీహెచ్ఎంసీలో 5 నుంచి 15కు, ఇతర కార్పోరేషన్లలో 5 నుండి 10 వరకు కో ఆప్షన్ సభ్యుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ఫారెస్టు యూనివర్శిటీకి కొత్త పోస్టులను మంజూరీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.
సుంకిశాలకు రూ.2,214.79 కోట్లు
సుంకిశాల నుంచి హైద్రాబాద్ నగరానికి నీటి సరఫరా వ్యవస్థను మెరుగు పరచాలని మంత్రివర్గం నిర్ణయించింది. దానికోసం అదనంగా 33 టీఎంసీల నీటిని శుద్ధిచేసి సరఫరా చేయాలనీ, ఈ పనుల కోసం రూ.2,214.79 కోట్లను మంజూరు చేస్తూ తీర్మానం చేశారు. నూతన జిల్లా కోర్టు భవనాల నిర్మాణం కోసం 21 జిల్లా కేంద్రాల్లో స్థలాల కేటాయింపు జరపాలనీ, భద్రాచలంలో ముంపు ప్రాంతాల్లోని 2,016 కుటుంబాలకు నూతనంగా కాలనీలు నిర్మించి ఇవ్వాలని కూడా మంత్రివర్గం తీర్మానించింది.
పోడు భూములపై...
పోడు భూముల విషయంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. ఈ సమస్య పరిష్కారానికి ఆయా జిల్లాల్లోని రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలతో ఆయా జిల్లాల మంత్రుల ఆధ్వర్యంలో, సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి అవసరమైన చర్యల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేపట్టాలని మంత్రివర్గం సూచించింది.