Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సాగుదార్లందరికీ హక్కుపత్రాలివ్వాలి
- కౌలురైతులకూ రుణార్హత కార్డులు
- 73 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాలను సవరించాలి
- సీఎంకు సీపీఐ(ఎం) బృందం వినతి
- సానుకూలంగా స్పందించిన కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, శాసనసభాపక్ష మాజీ నేత జూలకంటి రంగారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మనుగోడు ఉప ఎన్నికలు, రాజకీయ అంశాలతోపాటు ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. బీజేపీని ఎదుర్కొవడానికి అనుసరించాల్సిన వ్యూహం, జాతీయ స్థాయిలో కలిసి పనిచేయడంపైనా వారి మధ్య చర్చకు వచ్చింది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వివిధ తరగతుల ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని సీఎంకు సీపీఐ(ఎం) నేతలు వివరించారు. ముఖ్యంగా కొంత కాలంగా వాటి పరిష్కారం కోసం అనేక ఆందోళనా, పోరాటాలు సాగుతున్నాయని గుర్తు చేశారు. ఆ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈనెల ఎనిమిది లేదా తొమ్మిదిన మరోసారి సమావేశమవుదామంటూ కేసీఆర్ చెప్పారని తమ్మినేని వీరభద్రం మీడియాతో అన్నారు.
సీపీఐ(ఎం) వినతిపత్రంలోని ప్రజా సమస్యలు :
1. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికే 13 లక్షల ఎకరాలకుగాను 3.5 లక్షల మంది హక్కుపత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోడు సాగుదార్లందరికీ హక్కు పత్రాలివ్వాలి.
2. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులున్నారు. వారి ద్వారానే రాష్ట్రంలో 30 శాతం భూమి సాగవుతున్నది. వారందరికీ 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం రుణార్హత కార్డులివ్వాలి.
3. ఎనిమిదేండ్ల నుంచి వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల జీవో సవరించలేదు. రోజు కూలి రూ.600లు ఉండేలా జీవోను వెంటనే సవరించాలి.
4. అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి రూ.ఐదు లక్షలివ్వాలి.
5. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఐదేండ్లకోసారి పెరుగుతున్న ధరలకనుగుణంగా కనీస వేతనాలను సవరించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎనిమిదేండ్లుగా వాటిని సవరించలేదు.
- కనీస వేతన సలహా మండలి తీర్మానం ప్రకారం 2021, జూన్‌లో (1) జీవో నెంబర్ 21 సెక్యూరిటీ సర్వీసెస్ (2) జీవో నెంబర్ 22 కన్స్ట్రక్షన్ లేదా మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్ (3) జీవో నెంబర్ 23 స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్ ఆపరేషన్స్ (4) జీవో నెంబర్ 24 కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్క్లూడింగ్ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ (5) జీవోనెంబర్ 25 ప్రయివేట్ ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. దాని ప్రకారంపైన పేర్కొన్న ఐదు జీవోలను విడుదల చేసింది. వాటి అమలుకు ఫైనల్ గెజిట్ ఇవ్వాలని ప్రభుత్వానికి బోర్డు సిఫారసు చేసింది. కానీ వాటికి గెజిట్ ఇవ్వలేదు. వెంటనే గెజిట్ ఇచ్చి ఫైనల్ జీవోలు జారీ చేయాలి. మిగిలిన 68 జీవోలనూ సవరించాలి.
6. ఆర్టీసీలో యూనియన్లను అనుమతించడం లేదు. ఇది సరైందికాదు. యూనియన్ కార్యకలాపాలను అనుమతించాలి. ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు జరపాలి. పెండింగ్‌లో ఉన్న 2017, 2021ల ఉద్యోగుల వేతన ఒప్పందాలను, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలి. సీసీఎస్, ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ప్రభుత్వం వాడుకున్నది. వాటిని తిరిగి చెల్లించాలి. బస్సులు, బస్ డిపోలను విస్తరించాలి. కొత్త బస్సుల కొనుగోలుకు బడ్జెట్ కేటాయించాలి.
7. జీవో నెంబర్ 317 అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులను వేర్వేరు జిల్లాలకు కేటాయించిన భార్యాభర్తలకు న్యాయం చేయాలి. పాఠశాలల్లో వేలాదిగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే నియామకాలు జరపాలి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాలు చేపట్టాలి. పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలి.
8. ధరణి పోర్టల్‌కు సవరణలు చేసి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి.
9. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి.
10. డ్వాక్రా మహిళలకు వడ్డీ డబ్బులు వారి అకౌంట్లో జమ చేయాలి. అభయహస్తం డబ్బులు తిరిగి ఇవ్వాలి.
11. రూ.లక్షలోపు రైతుల రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేయాలి.
12. ఏటూరు నాగారం, ఉట్నూరు, భద్రాచలం గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను మంజూరు చేయాలి.
13. గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతానికి రిజర్వేషన్ పెంచాలి. అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.
14. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రస్తుతం రూ.వెయ్యి ఇస్తున్నారు. దీనికి తోడు మరో రూ.రెండు వేలు పెంచుతామని అసెంబ్లీలో ప్రకటించారు. జీవో జారీ చేసి, అమలు చేయాలి.
15. రాష్ట్రంలో పీఆర్సీని అమలు చేసిన సందర్భంగా అన్ని రకాల కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు పెంచారు. కానీ ఒక్క గ్రామ పంచాయితీ కార్మికులకు మాత్రమే వేతనాలను పెంచలేదు. వారు చిరు ఉద్యోగులు. అత్యధికులు దళిత, బలహీన వర్గాలకు చెందినవారు. వారికి నామమాత్రంగా రూ.8,500లు మాత్రమే ఇస్తున్నారు. మున్సిపల్ కార్మికులకు వచ్చిన విధంగానే గ్రామపంచాయితీ కార్మికులకూ రూ.15,600లు చెల్లించాలి.
16. అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం వీఆర్ఏలకు పేస్కేల్ ఇవ్వాలి. వారసులకు ఉద్యోగాలివ్వాలి. వారి న్యాయమైన డిమాండ్లపై ప్రస్తుతం జరుగుతున్న సమ్మెను నివారించాలి.
17. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లస్థలాలివ్వాలి. హెల్త్‌కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేసి కొత్త విధానం రూపొందించి వైద్యం అందేలా కొత్తగా హెల్త్ కార్డులను ఇవ్వాలి.
18. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న 23,600 మంది ఆర్టిజన్లను జేఎల్‌ఎంలుగా కన్వర్ట్ చేయాలి. 6,500 మంది పీస్‌రేటు వర్కర్లకు కనీసవేతనం ఇవ్వాలి.
19. వైద్య ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు, పారామెడికల్ సిబ్బందిని 2016 సంవత్సరంలో ఇచ్చిన జీవో నెంబర్ 16 ప్రకారం అర్హత కలిగిన వారిని పర్మినెంట్ చేయాలి.
20. చేతివృత్తుల సంక్షేమ పథకాల్లో జరుగుతున్న లోపాలు, అవినీతిని అరికట్టి అర్హులందరికీ అందించాలి.
పచ్చని తెలంగాణలో మతచిచ్చుకు కుట్ర
- రాష్ట్రంలో విద్వేషాలకు తావులేదు
- స్వార్థ రాజకీయాలు, దుష్టశక్తులను తిప్పికొడదాం : కేసీఆర్ పిలుపు
- సీఎంతో సీపీఐ(ఎం) నేతల సమావేశం
స్వార్థ రాజకీయాల కోసం, విచ్చిన్నకర శక్తులు పచ్చని తెలంగాణలో మతం పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో మత విద్వేషాలకు తావులేదనీ, అందుకు ప్రయత్నించే స్వార్థ రాజకీయాలను, దుష్టశక్తుల ను ఐక్యంగా తిప్పికొడదామంటూ ప్రజాస్వామిక, లౌకికవాద శక్తులకు ఆయన పిలుపునిచ్చారు. మతం పేరుతో ప్రజల నడుమ విభజన తేవాలని చూసే స్వార్థ రాజకీయాలను తిప్పికొట్టేందుకు తమతో కలిసిరావాలని బుద్ది జీవులు, మేధావులను ఆహ్వానించారు. ఈమేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు పలు రాజకీయ జాతీయ అంశాలపై చర్చించారు. అనంతరం కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్వార్థ రాజకీయ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక వాదులు, మేధావులు ప్రజాపక్షం వహించే రాజకీయవేత్తలు కదిలిరావాలంటూ తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి మద్దతు ప్రకటించేందుకు ముందుకు వచ్చిన సీపీఐ(ఎం)కు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, మతవిద్వేష శక్తులను ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటంలో తాము సంపూర్ణ మద్దతునందిస్తామని సీపీఐ(ఎం) నేతలు స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పై ఆ పార్టీ నేతలు సీఎంం కేసీఆర్‌కు వినతిపత్రాన్ని అందించారు.