Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టులూ కలిశారుొజనంతో కలిసుండండి
- అసెంబ్లీలో బీజేపీనే టార్గెట్: టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''కమ్యూనిస్టులు కూడా కలిశారు...మునుగోడులో విజయం మనదే. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ కంటే 14 శాతం అధిక ఓట్బ్యాంక్తో ఉన్నాం. కాంగ్రెస్ రెండోస్థానంలో నిలుస్తుంది. బీజేపీ మూడోస్థానానికే పరిమితం. ఇప్పటివరకు చేయించిన సర్వే ఫలితాల్లో తేలింది ఇదే'' అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు చెప్పారు. శనివారంనాడిక్కడి తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం శాసనసబా పక్ష సమావేశంలో ప్రధానంగా మునుగోడు ఎన్నిక, వచ్చే సాధారణ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనే సీఎం కేసీఆర్ ప్రస్తావించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మునుగోడులో ప్రతి రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యేలను ఇంచార్జిగా నియమిస్తామని చెప్పారు. ఈనెల 6, 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనీ, అక్కడ కూడా బీజేపీనే తమకు టార్గెట్ అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో అన్ని గ్రామాల్లో వనభోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు. కచ్చితంగా ప్రజాప్రతినిధులు దానిలో పాల్గొనాలనీ, ప్రజల సాదకబాదకాలు తెలుసుకొని, పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇప్పటి నుంచి వచ్చే సాధారణ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు అంతా ప్రజలతో మమేకమై ఉండాలనీ, ఎవరూ హైదరాబాద్లో కనిపించొద్దన్నారు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కూడా రావని హెచ్చరించినట్టు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో 500 మందికి దళిత బంధు ఇస్తున్నందున జాబితాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే ఒక్కో నియోజకవర్గంలో మూడువేల డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేల్లో సిట్టింగులకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తే 96 కుపైగా స్థానాల్లో గెలవబోతున్నామని తెలుస్తుందని చెప్పారు. జాతీయస్థాయిలో దళిత సమ్మేళనం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. త్వరలో జాతీయ స్థాయిలో దళిత సంఘాల నేతలతో సమావేశం వుంటుందని చెప్పారు. ఇటీవల జరిగిన జాతీయ రైతు సంఘాల నేతల సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను ప్రజాప్రతినిధులకు వివరించారు. పార్టీ కార్యకర్తలకు ప్రజాప్రతినిధులు సమయం కేటాయించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న హామీలన్నింటినీ ఇప్పుడు అమల్లోకి తెస్తామన్నారు. మరొకొంతమందికి పెన్షన్ ఇస్తామన్నారు. ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ఇస్తామనీ, లబ్దిదారుల జాబితాలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యేలు ధైర్యంగా ఉండాలనీ, ఈడీ, బీడీలు మనల్ని ఏం చేయలేవని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు బీజేపీ ఇక్కడ కూడా చేద్దామనుకుంటే కుదరదనీ, ఎక్కడ అవకాశం వచ్చినా బీజేపీని ఉపేక్షించొద్దని చెప్పారు. ఆపార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, దానివల్ల జరుగుతున్న నష్టాన్ని కూడా వారికి వివరించాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్థాయికి దిగజారి మాట్లాడారని అభిప్రాయపడ్డారు. పోడుకు సంబంధించి మండల స్థాయిలో కమిటీలు వేయాలని సూచించారు.