Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంలో హిజాబ్‌పై వాదనలు
న్యూఢిల్లీ : కేవలం హింస చెలరేగుతుందనే కారణంతో ఒక వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఎవరూ నియంత్రించలేరని హిజాబ్ వాదనల సందర్భంగా పిటిషనర్ స్పష్టం చేశారు. వీధుల్లో హిజాబ్ ధరించడం వల్ల శాంతి భద్రతలకు భంగం వాటిల్లదు కానీ, అదే ఒక విద్యార్థి హిజాబ్ ధరించి పాఠశాలకు వస్తే తలెత్తే శాంతి భద్రతల సమస్యలో పాఠశాలలు జోక్యం చేసుకోగలవా అని హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. దీనిపై కర్నాటక విద్యార్థి అయేషా షైషా తరపున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ మాట్లాడుతూ, శాంతి భద్రతలను నిర్ణయించడంలో పాఠశాలలకు ఎలాంటి పాత్ర లేదని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత అని కామత్ స్పష్టం చేశారు. ''ఒకవేళ నేను తలపాగా ధరిస్తే ఎవరైనా వీధిలో నినాదాలు చేయవచ్చు. అప్పుడు పోలీసులు నా వైపు తిరిగి నేను తలపాగా ధరించకూడదని చెప్పలేరు. అలాచేస్తే అది ఆందోళన చేసే వ్యక్తి హక్కును సమర్థించి నట్లవుతుంది'' అని న్యాయవాది వాదించారు. ఎదుటి పక్షం నుంచి ఆందోళనలు వస్తున్నాయనే కారణంతో భావ ప్రకటనా స్వేచ్ఛను, నిజాయితీతో కూడిన విశ్వాసాలను, ఎంపికలను ప్రభుత్వం నియంత్రించ గలదా అని కామత్ ప్రశ్నించారు. ''నన్ను నియంత్రించేకన్నా స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పరిఢవిల్లే పరిస్థితులను కల్పించడం ప్రభుత్వ బాధ్యత'' అని ఆయన అన్నారు. ''బయటి వ్యక్తులు కొందరు ఆరంజ్ షాల్స్ ధరిస్తామని నినాదాలు చేసినందునే ప్రభుత్వం హిజాబ్‌పై నిషేధపు ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అంటున్నారు. అంటే ఇది హిజాబ్ ధరించే వారి హక్కును రద్దు చేయడమేనా?'' అని న్యాయవాది కామత్ ప్రశ్నించారు. దీనిపై విచారణను సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.