Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మీరు గౌరవిస్తే ఓకే.. గౌరవించకపోయినా ఓకే...' అంటూ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్... ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధం గా నిర్వహించే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తనను ఆహ్వానించటం లేదనీ, తాము ఆహ్వానిస్తే సీఎం రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్ ఏమైనా అంటరాని స్థలమా..? అంటూ ఆమె ఈ సందర్భంగా ప్రశ్నిం చారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు సంబంధించిన ప్రొటోకాల్‌ను ఎంత మాత్రమూ పాటించటం లేదంటూ ఆక్షేపించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్న ప్రస్తుత తరుణంలో మహిళా గవర్నర్ అయిన తనను అవమానించటం తగునా..? అని ప్రశ్నిం చారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతాననీ, ప్రజలతో తాను మమేకం కావటాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర గవర్నర్‌గా తమిళి సై పదవీ బాధ్యతలు చేపట్టి మూడేండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ మూడేండ్ల కాలంలో గవర్నర్‌గా తాను చేపట్టిన కార్యక్రమాలు, పర్యటనలు, మహిళలు, గిరిజనులు, విద్యార్థులకు చేసిన సాయాలు, అధికారిక, అనధికారిక అంశాలతో కూడిన డాక్యుమెంటరీని, ప్రత్యేక పుస్తకా(టేబుల్ బుక్)న్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పాత్రికేయులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానా లిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్‌పైనా ఆమె ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజన హామీల గురించి పదే పదే మాట్లాడుతున్న కేసీఆర్... ఇటీవల కేరళలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అక్కడి వెళ్లి... రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి ప్రస్తావించొచ్చు కదా..? అని నిలదీశారు. గవర్నర్‌గా తాను రాజ్‌భవన్‌లో ఉంటున్నప్పటికీ అడుగడుగునా అవమానాలు, వివక్షతను ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేందుకు తనకు ప్రభుత్వం హెలికాప్టర్‌ను కేటాయించలేదని గుర్తు చేశారు. దాంతో తాను అటవీ ప్రాంతంలో రోడ్డు మార్గం ద్వారా అక్కడకు చేరుకోవాల్సి వచ్చిందని వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ గవర్నర్ చేత జాతీయ జెండాను ఆవిష్కరింపజేస్తే.. అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం తనను ఆహ్వానించ లేదని విమర్శించారు. పోలీసుల గౌరవ వందనం, పరేడ్, శకటాల ప్రదర్శన లేకుండా ఉత్సవాలను నిర్వహించటమేంటని అన్నారు. ఇదే సమయంలో వివిధ అధికారిక కార్యక్రమాలకు రాజ్‌భవన్ తరపున తాము ఆహ్వానించినా సీఎం రావటం లేదని తెలిపారు. 'ఆయా కార్యక్ర మాల సందర్భంగా ముఖ్యమంత్రి ఫొటో లేకపోవటం వల్లే ఆయన వాటికి రావటం లేదని మీరు చెబుతున్నారు. ఇప్పటి నుంచి ఫొటో పెట్టిస్తాం... సీఎం వస్తారా..?' అంటూ పాత్రికేయులను ఎదురు ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా తనను అన్ని పార్టీలు, సంఘాలు, సంస్థల వారు కలుస్తున్నారని వివరించారు. గతంలో టీఆర్ఎస్ ఎంపీ లు, ఎమ్మెల్యేలు సైతం కలిశారని గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు ఏమైందని నిలదీశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సంబంధించి.. తాను నియమ నిబంధనల ప్రకారం నడుచు కున్నానని వివరించారు. వాటికి విరుద్ధంగా ఒక వ్యక్తిని ఆ పదవికి నామినేట్ చేయమంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈ కారణంతోనే అధికార పార్టీ నేతలు తనను దూరం పెట్టటం సరికాదని అన్నారు. తాను నిర్వహిస్తున్న మహిళా దర్బార్‌కు విశేష స్పందన లభిస్తున్నదని గవర్నర్ ఈ సందర్భంగా చెప్పారు. ఆ సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలతోపాటు క్షేత్ర స్థాయిలో పరిశీంచిన ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి అనేక లేఖలు రాశానని తెలిపారు. కానీ వాటిలో ఏ ఒక్క దానికీ స్పందన రాలే దంటూ గవర్నర్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, సలహాదారులు ఏకే మహంతి, శర్మ పాల్గొన్నారు. పాత్రికేయులు ఈ సందర్భంగా గవర్నర్‌కు అభినందనలు తెలిపారు.