Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజాభిమానమే ఊతంగా పార్టీని పునర్ నిర్మిస్తామని సీపీఐ నూతన రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. తద్వారా రాష్ట్రంలో ఎర్రజెండాను బలోపేతం చేస్తామని చెప్పారు. చరిత్రకు వక్రభాష్యం చెబుతున్న ఆర్ఎస్ఎస్, బీజేపీలకు దేశ స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో పాత్ర ఏముందంటూ? ఆయన ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లోని మఖ్ధూంభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాజా మాజీ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పార్టీ మూడో మహాసభలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఓటింగ్‌లో కూనంనేని కార్యదర్శిగా ఎన్నికైనట్టు ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం జరిగిన ఓటింగ్‌లో కూనంనేని సాంబశివరావుకు 59 ఓట్లు, పల్లా వెంకటరెడ్డికి 45 ఓట్లు వచ్చాయని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ తెలిపారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్లో సంఫ్‌ు సర్ చాలక్ ప్రతిపాదించిన వ్యక్తే తదుపరి అధినేత అవుతారనీ, అదే విధంగా బీజేపీ అధ్యక్షుణ్నీ, ప్రధానమంత్రిని ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 18న ఎన్నికలు నిర్వహిస్తారని ప్రకటించారే తప్ప ఓటర్ల జాబితా నేటి వరకు బయటపెట్టలేదని తెలిపారు. ఇలాంటి పార్టీలకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పారు. బీహార్‌లో నితీష్ కుమార్‌తో కలిసి అధికారం పంచుకున్న బీజేపీని బయటికి నెట్టేయించామనీ, దేశంలో లౌకికశక్తులు, వామపక్షశక్తులతో తిరిగి....బీజేపీకి దేశమంతా అదే గతి పట్టిస్తామని హెచ్చరించారు. విజయవాడలో జరగబోయే సీపీఐ జాతీయ మహాసభల్లో పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ తమ పరిధిని దాటుతోందనీ, రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుపట్టారు. బిగ్ బాస్ షో ఒక చెత్త అని పునరుద్ఘాటించారు. సినీ కళాకారులు, మహిళలంటే తనకు గౌరవం ఉందని తెలిపారు. అయితే సినీ నటుడు నాగార్జున డబ్బులకు కక్కుర్తి పడుతూ బిగ్ బాస్ షోను నడిపిస్తున్నారని తెలిపారు. సినీ నటుడు చిరంజీవి నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ప్రజలకు నష్టం కలుగుతుందని తాము చెబితే గతంలో కోకకోలా యాడ్‌లో నటించకుండా వెనక్కి తగ్గారని తెలిపారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కూనంనేని సాంబశివరావు చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి అనీ, విశాలాంధ్ర విలేఖరిగా, మండల పరిషత్ అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా, పార్టీ సహాయ కార్యదర్శిగా సేవలందించారని గుర్తుచేశారు. సెప్టెంబర్ 11 నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. వాటిని నిర్వహించేందుకు టీఆర్ఎస్ ముందుకు రావడం ముదావహమనీ, ఆ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పాత్రను గుర్తించాలని డిమాండ్ చేశారు. చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. శిధిలావస్థలో ఉన్న స్థూపాలు, బురుజులకు మరమ్మతులు చేసి కార్యక్రమాలను అక్కడే అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కూనంనేని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నేత ఎన్.బాలమల్లేష్ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.