Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆగస్టు 31న ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగియనున్నాయి. చివరి ఘట్టమైన నిమజ్జనానికి గ్రేటర్లో జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్ వద్ద 22 క్రేన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 6 లక్షలకుపైగా విగ్రహాలు నిమజ్జనానికి తరలిరానున్నాయి. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ పెద్ద వినాయక విగ్రహ నిమజ్జనం కూడా శుక్రవారమే ఉంది. ఈ కార్యక్రమ విజయవంతానికి జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ, హెచ్ఎండీఏ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి.
గ్రేటర్లో మొత్తం 98 క్రేన్లు
గ్రేటర్లో వినాయక నిమజ్జనానికి 30 చెరువులతోపాటు 74 తాత్కాలిక చెరువులు, పొర్టబుల్పాండ్స్, ప్రత్యేకంగా తవ్విన గుంతలను ఏర్పాటు చేశారు. వీటన్నింటి దగ్గర 98 క్రేన్లను అందుబాటులో ఉంచారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఎన్టీఆర్‌మార్గ్‌లో 8, నెక్లెస్ రోడ్డులో నాలుగు, ట్యాంక్‌బండ్‌పై 10క్రేన్లను ఏర్పాటు చేశారు. గ్రేటర్లో సుమారు 6లక్షల విగ్రహాలను ప్రతిష్టించారు. వీటిలో సుమారు 2లక్షల వరకు పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు లక్ష వరకు విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 10,470 మంది సిబ్బంది నియమించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 354 కిలో మీటర్ల మేర గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుగనుంది. 168 గణేష్ యాక్షన్ బృందాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. నిమజ్జన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడూ చెత్తను తొలగించడానికి 10,470 మంది పారిశుధ్య సిబ్బందిని నియమించారు. 303కిలోమీటర్ల పరిధిలో 253 గణేష్ యాక్షన్ టీమ్స్(గ్యాట్)లను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేయనున్నాయి.
48,179లైట్లు
నిమజ్జనం సందర్భంగా శోభాయాత్ర జరిగే మార్గంతోపాటు చెరువులు, హుస్సేన్‌సాగర్ ప్రాంతాల్లో రూ.2.43కోట్లతో 48,179తాత్కాలిక లైట్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు హుస్సేన్ సాగర్ చుట్టూ 48 ట్రాన్స్ఫార్మర్స్, సరూర్‌నగర్ చెరువు దగ్గర 5, గ్రేటర్‌లోని ఆయా చెరువుల దగ్గర మరో 101 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షించడానికి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేశారు.
13బోట్లు..
నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అగ్నిమాపకశాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బోట్లను ఏర్పాటు చేశారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సరూర్‌నగర్, ప్రగతినగర్, కాప్రా చెరువుల దగ్గర నాలుగు బోట్లను అందుబాటులో ఉంచారు. దీంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ ట్యాంక్‌బండ్‌పై మూడు, నెక్లెస్‌రోడ్డులో రెండు, మరో నాలుగు స్పీడ్ బోట్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో 38ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచే..
ట్రాఫిక్ ఆంక్షలు 9వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు అమలుకానున్నాయి. నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి జంక్షన్, ఖైరతాబాద్, ఎన్టీఆర్మార్గ్, ఐమాక్స్ రోడ్డులో 10వ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. నిమజ్జనం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ మార్గ్ నుంచి వెళ్లే లారీలు, ట్రక్కులు నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, వీవీ విగ్రహం, కేసీపీ మీదుగా వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. వాహనాలు తెలుగుతల్లి ఫ్లై ఓవర్, మింట్ కాంపౌండ్ వైపు రావడానికి అవకాశం లేదు. అప్పర్ ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి వచ్చే లారీలు, ట్రక్కులను చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా పంపించనున్నారు. దీంతోపాటు నిమజ్జన కార్యక్రమం చూడటానికి వాహనాల్లో వచ్చే వారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఖైరతాబాద్ జంక్షన్, ఎంఎంటీఎస్ స్టేషన్, ఖైరతాబాద్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు, బుద్ధభవన్ వెనక వైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, ఎన్టీఆర్ స్టేడియం, నిజాంకాలేజ్, పబ్లిక్ గార్డెన్స్. ఐమాక్స్ పక్కన పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల నుంచి రావడానికి 8ఎంఎంటీఎస్ రైళ్లు, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.