Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ తన పరిధుల్ని దాటుతున్నారు
- బీజేపీ నాయకురాలిగా మాట్లాడితే ఎలా?
- విభజన హామీలపై కేంద్రంతో
ఎందుకు చర్చించరు?: తమిళిసై పై
మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ చరిత్ర గురించి గవర్నర్‌కు ఏం తెలుసునని విమోచన గురించి మాట్లాడుతున్నారు? ఆమెకు ఇక్కడి చరిత్ర పట్ల స్పష్టత లేదు... అని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తాను మంత్రి పదవి చేపట్టి మూడేండ్లు పూర్తయిందని వివరించారు. రాజ్‌భవన్ పరిదినిó దాటి గవర్నర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉంటూ రాజకీయాలు చేయటం తగదని హితవు పలికారు. రాష్ట్రంలో ఎంతో మంది గవర్నర్లు పనిచేశారని గుర్తుచేశారు. ఎప్పుడూ తలెత్తని ఇబ్బందులు ఇప్పుడెందుకొస్తున్నాయో సమీక్షించుకోవాలని తమిళి సైకి సూచించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ బీజేపీ నాయకురాలిగా వ్యవహరించటం తగదన్నారు. రాజ్‌భవన్‌లో ప్రజాదర్భార్లు నిర్వహించటం ద్వారా సమస్యలు ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర సర్కారు నుంచి రావాల్సిన నిధులతోపాటు, విభజన హామీల అమలు కోసం గవర్నర్‌గా కేంద్రంతో ఎన్ని సార్లు మాట్లాడారో చెప్పాలన్నారు. లేని సమస్యలను ఉన్నట్టుగా చూపటం సరికాదన్నారు. మహిళలంటే సీఎం కేసీఆర్‌కు ఎనలేని గౌరవమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర సర్కార్ ప్రశంసిస్తుంటే..గవర్నర్ మరోలా మాట్లాడటం తగదని హితవు పలికారు. ఆమె ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని మంత్రి సూచించారు.
గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమమే లక్ష్యంగా పనిచేశా..
గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను సీఎం కేసీఆర్ తనకు అప్పగించి మూడేండ్లు పూర్తయ్యాయని సత్యవతి ఈ సందర్భంగా చెప్పారు. ఈ కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు వారధిగా పనిచేశానని చెప్పారు. ఒకప్పుడు గర్భిణులను కావడిగట్టి ఆస్పత్రుల్లోకి తీసుకుపోవాల్సిన దుస్థితి ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా అందరికీ మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నామన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్య లక్ష్మి పథకం దేశంలో మరే రాష్ట్రంలో లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు వేతనాలు పెంచామని గుర్తుచేశారు. మహిళల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని గుర్తించి, గిరిపోషణ, బాలామృతం, కేసీఆర్ న్యూట్రీషన్ లాంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. మరో పక్క అందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో గురుకులాల సంఖ్యను పెంచామని తెలిపారు.ప్రాధమిక స్థాయి నుంచి విదేశీ విద్య వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పారు. మూడు వేలకుపైగా గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసి, గ్రామపంచాయతీ భవన నిర్మాణాలను చేపట్టామన్నారు. మహిళల రక్షణకు అనేక చర్యలు చేపట్టామంటూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.