Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభాసు పాలవుతున్న 'మన ఊరు- మనబడి'
- పనులు పూర్తయినా నిధుల మంజూరులో జాప్యం
- కరీంనగర్ జిల్లాలో రెండుచోట్ల తాళాలేసిన కాంట్రాక్టర్లు
- సమస్యల గుర్తింపునకే పరిమితమైన కమిటీలు
- చాలా చోట్ల శిథిలావస్థలో తరగతి గదులు
నవతెలంగాణ - కరీంనగర్, రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధులు
రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. పనులు ప్రారంభించి పూర్తి చేయాల్సిన వాటిల్లో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పాఠశాలలకు తాళాలు వేసిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లాలో సమస్యలు గుర్తింపునకే కమిటీలు పరిమితం అయ్యాయి. కరీంనగర్ జిల్లాలో ''మన ఊరు.. మన బడి'' కింద మొదటి దఫాలో 230 పాఠశాలలను గుర్తించారు. ఇందులో 214 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు రూ.31.26కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో 207 పాఠశాలలకు సంబంధించిన పనులు చేపట్టేందుకు సంబంధిత ఇంజినీరింగ్ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. జగిత్యాల జిల్లాలో 274 పాఠశాలలను మొదటి దఫాలో గుర్తించగా, 271 పాఠశాలల్లో పనులకు అనుమతులు ఇచ్చి రూ.63.56కోట్లు మంజూరు ఇచ్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 172 పాఠశాలలకుగాను మొత్తం స్కూళ్లలో పనులకు మొదటి దఫాలోనే రూ.20.42కోట్ల అంచనాతో అనుమతులు ఇచ్చారు. పెద్దపల్లి జిల్లాలో 191 పాఠశాలలను మొదటి దఫాలో గుర్తించగా, 188 పాఠశాలల్లో పనులకు రూ.35.92కోట్ల అంచనాతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇందులో కొన్ని పనులు పూర్తవగా, మరికొన్ని ప్రగతిలో ఉన్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2383 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 'మన ఊరు - మన బడి' పథకం కింద మొదటి విడతలో 981 స్కూళ్లు ఎంపిక చేశారు. ఇందుకు రూ.164 కోట్ల నిధులు కేటాయించగా.. విడుదల చేసింది మాత్రం రూ.12 కోట్లని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నిధులు కూడా పాఠశాలలకు అందలేదు. దాంతో 'మన ఊరు-మన బడి' కింద ఎంపికైన పాఠశాలల్లో కేవలం సమస్యలను గుర్తించడం తప్పా పనులు మాత్రం జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. 'మన ఊరు-మన బడి' కింద 24 పాఠశాలలు ఎంపిక చేశారు. హడావుడిగా సమస్యలను గుర్తించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలలో పనులు ప్రారంభించలేదు. ఒకట్రెండు స్కూళ్లకు మాత్రమే రూ.20 నుంచి రూ.50 వేల వరకు ఖాతాలో జమ చేశారు.
పలుచోట్ల 'మన ఊరు మనబడి' పరిస్థితి ఇదీ..
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఎంపిక చేసిన పనులకూ ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదు. నెలలు గడుస్తున్నా రూ.55లక్షల విలువైన పనులకు నిధుల మోక్షం కలగడం లేదు.
చొప్పదండి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోనూ రూ.27లక్షలతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రణాళికలు పూర్తయినా ఇక్కడ అడుగు పడటం లేదు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అల్గునూర్ డివిజన్‌లోనూ ప్రాథమిక పాఠశాల పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పుడున్న పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా, ప్రస్తుతం దాన్ని కూల్చివేయాల్సి ఉంది. అయితే, అందుకు జిల్లా పరిషత్ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆ పాఠశాల భవన పున్ణనిర్మాణంలో భాగంగా కొంత నిధులు మంజూరై, కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నా.. భవనం కూల్చివేత దశలోనే నిలిచిపోయింది.
గన్నేరువరం మండలం కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ చేపట్టిన పనులకు ఇంతవరకు రూపాయి కూడా సదరు కాంట్రాక్టర్ చేతికి అందలేదు. దాంతో సుమారు రూ.16లక్షలతో చేపడుతున్న ఈ పనులు ముందుకు సాగడం లేదు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. 'మన ఊరు-మన బడి' కింద 24 పాఠశాలలు ఎంపిక చేశారు. హడావుడిగా సమస్యలను గుర్తించారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పాఠశాలలో పనులు ప్రారంభించలేదు. ఒకట్రెండు స్కూళ్లకు మాత్రమే రూ.20 నుంచి రూ.50 వేల వరకు ఖాతాలో జమ చేశారు.
ఊరేళ్ల గ్రామంలోని ప్రైమరీ, హైస్కూల్లో కలిపి మొత్తం 250 విద్యార్థులున్నారు. ఈ పాఠశాల సక్సెస్ స్కూల్ అయినప్పటికీ వసతులు మాత్రం అత్తేసరుగానే ఉన్నాయి. కనీసం విద్యార్థులు కూర్చోవడానికి బల్లలు లేక నేలపై కూర్చుంటున్నారు. ఆరు, ఏడు తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయి. దాంతో వర్షం వచ్చిందంటే ఆ రెండు తరగతులకు సెలవు ఇవ్వాల్సిందే. ప్రైమరీ పాఠశాలకు రూ.56లక్షలు, హైస్కూల్‌కు రూ.2కోట్ల 30లక్షలు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు ప్రైమరీ స్కూల్ ఖాతాలో రూ.5 లక్షలు మాత్రమే జమ చేశారు. హైస్కూల్‌కు నయాపైసా ఇవ్వలేదు. దాంతో పాఠశాలలో గుర్తించిన పనులు ముందుకు సాగడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నీ పాఠశాలల ఈ పరిస్థితి ఇదే. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి 'మన ఊరు-మన బడి' కింద ఎంపిక చేసిన పాఠశాలలకు పూర్తిగా నిధులు మంజూరు చేసి, పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
52 స్కూల్స్‌లో వర్క్స్ జరుగుతున్నాయి
' మన ఊరు- మన బడి ' పథకంలో మొదటి విడతలో ఎంపిక చేసిన స్కూల్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో బడ్జెట్ రాలేదు. రూ. 180 కోట్లకు గాను ప్రస్తుతం రూ. 7 కోట్ల నిధులు వచ్చాయి. జిల్లాలోని 52 పాఠశాలలో వర్క్ నడుస్తోంది. త్వరలోనే నిధులు మంజూరు చేసి, సమస్యలు పరిష్కరిస్తాం.
సుసిందర్రావు , రంగారెడ్డి జిల్లా విద్యాధికారి