Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారతీయ మహిళలకు మనుస్మృతి గొప్పవరం లాంటిదంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎంసింగ్ చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా సమన్వయ కమిటీ(సీఐటీయూ అనుబంధం) కన్వీనర్ ఎస్వీ రమ పేర్కొన్నారు. న్యాయమూర్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనుస్మృతిని ఆచరించాలని చెప్పడమంటే సమాజంలో అసమానతలు తొలగిపోవాల్సిన అవసరం లేదనీ, మహిళల పట్ల వివక్ష కొనసాగాలని కోరువటమేనని పేర్కొన్నారు. ఓ పక్క ఉపాధి అవకాశాల్లో మహిళలు దూసుకుపోతూ సమానపనికి సమాన వేతనం కోసం పోరాడుతున్న తరుణంలో స్త్రీలను వంటింటికే పరిమితం చేయాలని చెప్పే మనుస్మృతి గొప్పదంటూ మాట్లాడటం శోచనీయమని తెలిపారు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వ్యక్తులు దాని ప్రకారం నడుచుకోవాలని సూచించారు. మహిళలను అగౌరవపరిచే వ్యాఖ్యలను న్యాయమూర్తి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.