Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విటర్ వేదికగా కేంద్రంపై కేటీఆర్ ఫైర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో.. ఎలా పోరాడాలో మాకు తెలుసు...' అంటూ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కేంద్రంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కలలు కనడం.. వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు బాగా తెలుసంటూ శుక్రవారం ట్విటర్ వేదికగా మోడీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మిషన్ భగీరథ పథకానికి సాయం చేసేందుకు నిరాకరించినా... ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తున్న రాష్ట్రంగా నిలిచామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతి చక్రానికి కేంద్రం కొన్ని ఆటంకాలు కలిగించొచ్చుగానీ.. అభివృద్ధి దిశగా రాష్ట్ర పయనాన్ని మాత్రం అడ్డుకోలేరని హెచ్చరించారు. ఐటీఐఆర్‌ను రద్దు చేసినప్పటికీ రాష్ట్ర ఐటీ రంగం గత ఎనిమిదేండ్లలో 3.2 రెట్ల వృద్ధిని సాధించిందని వివరించారు. గతేడాది దేశంలోని మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్‌లోనే వచ్చిందని పేర్కొన్నారు. సకాలంలో నిధులివ్వకపోయినా.. ఎఫ్ఆర్బీఎం ఆంక్షలు విధించినా తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా రెట్టింపయిందని తెలిపారు,. పారిశ్రామిక కారిడార్లను కేంద్రం తిరస్కరించినప్పటికీ రాష్ట్రంలో అద్భుతమైన వృద్ధి నమోదైందని వివరించారు. మొత్తం 20 వేల పారిశ్రామిక యూనిట్ల మంజూరుతోపాటు 16 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు. రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీని నిర్మించామంటూ కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.