Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం మైన్స్ పాలసీల్లో నూతన సంస్కరణలను తీసుకొచ్చి, బ్రిటీష్ కాలంనాటి 49 మైనింగ్ అనుమతుల నిబంధనలను 24కు తగ్గించిందని కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. ఈ మార్పుతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మినరల్ బ్లాక్‌ల అన్వేషణలో ప్రయివేటు కంపెనీల పెట్టుబడులకు అవకాశం కల్పించిందన్నారు. బ్లాక్‌ల వేలాన్ని సులభతరం చేయడంతో పోటీ పెరిగి రూ.90వేల కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. ఖనిజాల అన్వేషణ, వేలం వేయడం కోసం రాష్ట్రాలకు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలీ ఫెనాన్షియల్ డిస్ట్రిక్‌లోని నక్షత్రాల హౌటల్లో వివిధ రాష్ట్రాల గనుల శాఖల మంత్రుల జాతీయ సదస్సు జరిగింది. దీనికాయన ముఖ్యఅతిథిగా హాజరై 'ది మైనింగ్ ఎరీనా' అనే డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనింగ్ రంగంలో ప్రస్తుతం 0.9శాతం జీడీపీ ఉందనీ, 2030 నాటికి 2.5శాతానికి పెరగాలని ప్రధాన మంత్రి నరేందమోడీ టార్గెట్ విధించారని చెప్పారు. దీనికోసం ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాలన్నింటినీ భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి 2014లో 572 మిలియన్ టన్నులు ఉండగా, ఇప్పుడు 800 మిలియన్ టన్నులకు పెరిగిందన్నారు. 2023 నాటికి బొగ్గు ఉత్పత్తి 900 మిలియన్ టన్నులకు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వకుండా నిబంధనలను అతిక్రమించిన 17 కోల్ బ్లాక్‌లను తిరిగి స్వాధీనం చేసుకున్నామనీ, వీటిని తిరిగి వేలం వేస్తామన్నారు. త్వరలో 48 కమర్షియల్ కోల్ బ్లాక్‌ల వేలం జరగనుందని వివరించారు. రాష్ట్రాలు నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ) నిధులను వినియోగించు కోవాలని సూచించారు. ఎంఎండీఆర్ చట్ట సవరణల తర్వాత 10 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 206 మినరల్ బ్లాక్‌లు వేలం జరిగిందన్నారు. ఈ సంస్కరణల వల్లే వేలం వేసే బ్లాకుల సంఖ్య మూడు రెట్లు పెరిగి, రాష్ట్ర ప్రభుత్వాలకూ ఆదాయం పెరిగిందన్నారు. కోలిండియా, సింగరేణీ, ప్రయివేటు కంపెనీల వద్ద 26 నుంచి 30 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయనీ, దిగుమతి చేసుకున్న బొగ్గు నిల్వలు 6 మిలియన్ టన్నులు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో 11 రాష్ట్రాల గనుల శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ హాజరయ్యారు.