Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
- రాష్ట్రంలో 50కిపైగా ప్రాంతాల్లో భారీవర్షాలు
- వచ్చే రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. అక్కడ 24 సెంటీమీటర్ల వర్షపాతం(రాత్రి పదున్నర వరకు) రికార్డయింది. రాష్ట్ర వ్యాప్తంగా 682 ప్రాంతాల్లో వాన పడింది. 301 ప్రాంతాల్లో మోస్తరు, 47 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు పాటు పలు ప్రాంతాల్లో ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రం మీదుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉంది. అది మరింత బలపడే అవకాశముంది. దానికి అనుబంధంగా సముద్ర మట్టం నుంచి ట్రోపోస్పియర్ స్థాయి వరకు ఆవర్తనం నెలకొని ఉంది.దక్షిణ కొంకణ్ నుంచి ఉత్తరాంధ్ర, ఒడిశా, దక్షిణ తెలంగాణ, ఉత్తర అంతర్గత కర్నాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు మరో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది.
రాష్ట్రంలో శనివారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికను విడుదల చేసింది. రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. హైదరాబాద్లో వచ్చే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశముంది. అప్పుడప్పుడు వేగవంతమైన జల్లులు పడే సూచనలు కనిపిస్తున్నాయి.
అత్యధిక వర్షం కురిసిన ఐదు ప్రాంతాలు
1. పాల్వంచ(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) - 24.00 సెంటీమీటర్లు
2. పోచంపల్లి(కరీంనగర్ జిల్లా) - 14.45 సెంటీమీటర్లు
3. గూడూరు (మహబూబాబాద్) - 14.05 సెంటీమీటర్లు
4. లక్ష్మిదేవిపల్లి (భద్రాద్రి కొత్తగూడెం) - 13.30 సెంటీమీటర్లు
5. తిరుమలాపూర్(జగిత్యాల జిల్లా) - 11.00 సెంటీమీటర్లు