Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
- బస్‌భవన్‌లో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజల తరఫున తన కవిత్వం ద్వారా పాలకులను ప్రశ్నించిన యోధుడు కాళోజీ అని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ఆయన తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేశారని కొనియాడారు. టీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి చైర్మెన్ నివాళులు అర్పించారు. కాళోజీ నారాయణరావు 1914, సెప్టెంబరు 9న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి పల్లెలో మహారాష్ట్రీయుడు తండ్రి కాళోజీ రంగారావు, కన్నడిగుల ఆడపడుచు, తల్లి రమా బాయమ్మకు జన్మించారని తెలిపారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచారనీ రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట అని చెప్పారు. 'నా గొడవ' పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా ఆయన కీర్తి గడించారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతను గేయాల్లో కనిపిస్తాయన్నారు. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన తన కలం ఎత్తారనీ, స్వతంత్ర సమర యోధుడు, తెలంగాణా ఉద్యమకారుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని అన్నారు. 1992లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిం దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారని గుర్తుచేశారు. వరంగల్‌లోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారనీ, హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నారని వివరించారు. త్వరలో టీఎస్ఆర్టీసీలో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామన్నారు. సంస్థ ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి బయట పడుతున్నదని అన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు సీపీయమ్ యుగెందర్, ఈడిఓ ముని శేఖర్, ఈడిఈ వినోద్ కుమార్, సీఎఫ్ఎమ్ విజయా పుష్ప, సీటీఎం ఎమ్ఎన్సీ కష్ణకాంత్, సీటీఎం విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు..