Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టెంబర్ 17 చరిత్రను మరోసారి తెలుసుకోండి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినమంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానిం చడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. ఆమె బీజేపీ కార్య కర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శిం చారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరమని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్ స్థాయిలో ఉంటూ రాజకీయాలు మాట్లాడ్డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ నాయకుల స్క్రిప్టును ఆమె చదివినట్టుగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను మరోసారి చదువుకోవాలనీ, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు వీరోచిత పాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. ఆనాడు నైజాం నియంతృత్వ విధానాలపై సుదీర్ఘ పోరాటం సాగిందనీ, అందులో అన్ని మతాలూ, కులాల ప్రజలూ పాల్గొన్నారని పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ నాయకుల తరహాలో హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్డడం సరైంది కాదని తెలిపారు.