Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యరంగంపై గవర్నర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
- దసరా నుంచి ఏఎన్ఎం ఉప కేంద్రాలను బస్తీ దవాఖానాలుగా మారుస్తాం
- తాండూరులో రూ.30 కోట్లతో నర్సింగ్ కళాశాల ఏర్పాటు : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు
- తాండూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-తాండూరు
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర గవర్నర్ వైద్యుల సేవల పట్ల హేళనగా మాట్లాడడం సరికాదని, తెలంగాణలో వైద్యం బాగా లేదని గవర్నర్ అనడం పట్ల మంత్రి తీవ్రంగా ఖండించారు. గవర్నర్ తీరు డాక్టర్ల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ కేంద్రంలోని నేషనల్ గార్డెన్లో ఏర్పాటుచేసిన ఆశా సమ్మేళనా కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఏఎన్ఎం, ఆశావర్కర్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రాథమిక దశలో ప్రజల అనారోగ్య పరిస్థితిని గుర్తించి చికిత్స అందజేయాలని సూచించారు. అదేవిధంగా ప్రజా ఆరోగ్య పరిరక్షకులుగా, వారధులుగా ముందుండి పని చేయాలని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మంచి జీతాలను అందిస్తూ ప్రభుత్వం చేయూతనిస్తుందన్నారు. కరోనా సమయంలో, వాక్సినేషన్ విషయంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బందితోపాటు సీనియర్ అధికారులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారని, ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని హంగులతో ఆస్పత్రుల భవనాలు నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 66 శాతానికి పెరిగిందని అన్నారు. వికారాబాద్ జిల్లాలో 80 శాతం ప్రసవాల సంఖ్య పెరగడం అభినందనీయమన్నారు. తాండూర్‌లో రూ.30కోట్లతో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేశామని హామీ ఇచ్చారు. ఆశావర్కర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. దసరా నుంచి ఏఎన్ఎం ఉప కేంద్రాలను బస్తీ దవాఖానాలుగా మారుస్తామని తెలిపారు. మంత్రి సబితా రెడ్డి మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు విశేషమైన సేవలందిస్తూ అమ్మ పాత్రను నిర్వహిస్తున్నారని తెలిపారు. తాండూర్ జిల్లా ఆస్పత్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావును కోరారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు మంత్రుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, వైద్యారోగ్యశాఖ కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమల్, వైస్ చైర్పర్సన్ దీప నర్సింలు, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రాజుగౌడ్, డీఎస్పీ శేఖర్‌గౌడ్, ఆర్టీఓ అశోక్ కుమార్, సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.