Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పందులు మా పంటచేలకు వస్తున్నాయంటూ దాడులు
- స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు
- బీజేపీ అండదండలతోనే దాడులంటూ విమర్శలు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
''పందులు సాదుకునే దమ్ములేకుంటే సంపుకోవాలి.. లేదంటే మేమే చంపేస్తాం.. ఇప్పుడయితే కట్టేసి కొడుతున్నాం.. మరోసారి పందులు మా పంట చేలకు వస్తే.. పందులతో పాటు మిమ్ములను ఒకే దగ్గరేసి కాల్చేస్తాం..'' అంటూ గద్వాల మండలం అనంతపూర్ గ్రామంలో ఎరుకల సామాజిక తరగతికి చెందిన చిన్న సవారన్న, రామచంద్రం, రాములమ్మను పొలం దగ్గర నుంచి చెర్నకోలతో కోడుతూ.. గ్రామ చావడి దగ్గరకు లాక్కొచ్చారు. అక్కడ స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఇలా ప్రతి నిత్యం ఏదో ఒక చోట వీరిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వారికి పందుల పెంపకమే జీవనాధారం.. మరో వృత్తి లేదు. దాడులపై ఫిర్యాదు చేసినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని వృత్తిదారులు వాపోయారు.
గద్వాల మండలం అనంతపూర్ గ్రామంలో ఎరుకలి రామచంద్రుడు, సవారన్న నిరుపేద కుటుంబానికి చెందిన వారు. వీరికి గ్రామంలో భూములు లేవు. ఆ కుటుంబంలో చదువుకున్న వారెవరూ లేరు. పందుల పెంపకంతోపాటు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. పొలంలో పడకుండా పందుల కాపాలా ఉండేవారు. గురువారం గ్రామ సమీపంలో గట్టువెంట పందులను మేపుతుండటాన్ని చూసిన గ్యాంగ్ సవారన్న కుమారులు రాజుతో పాటు కొంతమంది కలిసి ఎరుకలి సవారన్నను చితకబాదుతూ గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామ చావిడి దగ్గరకు తీసుకొచ్చి సవారన్న, రామచంద్రుడును స్తంభానికి కట్టేసి కొట్టారు. దాహం వేస్తోందన్నా వినకుండా బాదారు. ఆరు గంటల సేపు దాడి చేశారు. కొద్దిసేపయితే వారి పరిస్థితి విషమించేది. కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా వినకుండా కొట్టడంతో గ్రామస్తులు చలించిపోయారు. వారిని కాపాడారు. ఈ దాడి వెనక బీజేపీ నాయకుల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. వారంతా బీజేపీకి దూరంగా ఉండటం వల్ల ఒత్తడి చేసి పార్టీలోకి మార్చుకోవాలని ఇలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పెరుగుతున్న దాడులు
పందుల పెంపకం తప్ప మరో వృత్తి లేని తమపై కొన్ని సామాజిక వర్గాలు జులుం ప్రదర్శిస్తున్నాయని వారు అంటున్నారు. బీసీల దాడుల వెనుక కొంత మంది హస్తం ఉందనే విమర్శలు ఉన్నాయి. వనపర్తి జిల్లా తల్పునూరు
గ్రామంలో పంట చేల్లోకి పందులు పోయాయని తమపై దాడులు చేశారని ఎరుకల కృష్ణమ్మ, యాదగిరి, లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పోలీసు స్టేషన్లో కేసు పెట్టినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బిజనపల్లి మండలం మంగనూర్ గ్రామంలో చిన్న బుడ్డయ్య, పెద్దబుడ్డయ్య, కొండయ్యను చితక బాదారు. అడవి పందులు పడి చేను నాశనం చేస్తే.. శిక్ష తమకెందుకు అని పోలీసు స్టేషన్లో విన్నవించుకున్నా రక్షణ లేకుండా పోయిందని చెబుతున్నారు. సల్కిరపేట గ్రామానికి చెందిన ఎరుకలి తిరుపతయ్య, అతని తల్లి పోషమ్మపై దాడి జరిగింది. పందులను సైతం లేకుండా చేశారు. ఇదే విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఎరుకలి బాలనర్సింహ, అతని బార్యను చితకబాదారు. అవమానం భరించలేక అతని భార్య పురుగుల మందు తాగింది. ఇలాంటి ఘటనలు ప్రతి రోజూ ఏదో ఒకచోట జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
చంపేస్తారేమో అనే భయమేసింది : సవారన్న అనంతపూర్- గద్వాల మండలం
పంట చేల నుంచి గ్రామ చావిడి వరకు చెర్నకోలతో కొట్టుకుంటూ వచ్చారు. గ్రామ చావిడి దగ్గర ఉన్న స్తంభానికి కట్టేసి కొట్టారు. మరో గంట అయితే చనిపోయేవాడిని. పందులను గట్ల వెంట మేపాను. పంట చేల్లోకి పోలేదు. గతంలో అడవి పందులు మేసినట్టు ఉంది. మేమే మేపినమని కొట్టిర్రు.
మేమెలా బతకాలి: ఎరుకలి రాములమ్మ- అనంతపూర్
మాకు భూమి లేదు. ఇతర ఏ వృత్తి రాదు. పందులను పెంచుకున్నాం. అడవిలో వాగులు వంకలు తిరిగి వాటిని మేపుతుంటాం. పంట చేలను మేపాలని మాకు లేదు. కూలీ పనులు చేసుకోకుండా కొట్టారు. మేము ఎలా బతకాలి.
దాడులు చేయడం తప్పు:ప్రతాప్‌గౌడ్- గద్వాల ఎంపీపీ
ఏమైనా పంట నష్టం జరిగితే పోలీసు కేసు చేయాల్సి ఉండేది. రెవెన్యూ వారికి చెబితే పంట నష్టం ఎంతో పరిశీలించేవారు. కానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం భావ్యం కాదు. ఈ ఘటన వెనకాల ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలి.