Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కూనంనేని తొలి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు చెందిన డీఎస్సీ-1998 అర్హులైన అభ్యర్థులకు ఎంటీఎస్ పద్ధతిన (కనీస వేతన స్కేలు) ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం ఆయన తొలి లేఖ రాశారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హులైనవారు తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో దాదాపు 1,500 మంది అభ్యర్థులున్నారని తెలిపారు. వారికి నష్టం జరిగిందని పేర్కొన్నారు. 24 ఏండ్లుగా వారు ఉద్యోగాల కోసం ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. 2016, జనవరి మూడున అర్హులైన డీఎస్సీ-1998 అభ్యర్థులందరికీ మానవతా దృక్పథంతో ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చి న్యాయం చేస్తామంటూ సీఎం హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉద్యోగాలిచ్చే విషయంలో న్యాయపరమైన, సాంకేతిక సమస్యలున్నా సరిదిద్ది న్యాయం చేస్తామన్నారని తెలిపారు. ఏపీలో డీఎస్సీ-1998కు చెందిన అర్హులైన అభ్యర్థులందరికీ ఆ ప్రభుత్వం ఉద్యోగాలి చ్చిందని పేర్కొన్నారు. తెలంగా ణలోనూ డీఎస్సీ-1998 అభ్యర్థుల పట్ల సానుకూలంగా ఆలోచించి తర్వలో నియామక ప్రక్రియ చేపట్టా లనీ,వారి జీవితాలలో వెలుగులు నింపాలని కోరారు.
సురవరంను కలిసిన కూనంనేని
సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర నూతన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కలిశారు.
హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన కూనంనేని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసి పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా ఆయనకు సురవరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటి నర్సింహ ఉన్నారు.
కూనంనేనికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుక్రవారం సాయంత్రం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.