Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న ఇందిరాపార్కు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు : కార్మిక సంఘాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కనీస వేతనాల జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15,16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్టు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. 26న కలెక్టరేట్ల ఎదుట, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేస్తామని తెలిపారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఏఐటీయూటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్, ఐఎఫ్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఐదు కనీస వేతనాల జీవోలను వెంటనే గెజిట్‌లో ప్రింట్ చేసి అమలు చేయాలని కోరుతూ ఈ నెల రెండో వారంలో కార్మిక శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు. సమావేశ నిర్ణయాలకు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బా రామారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధానప కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆమోదం తెలిపి కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారని చెప్పారు.