Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడుపై ఏఐసీసీ ప్రకటన
- ఆశావాహులతో నేడు సమావేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని పేరును ఖరారు చేసింది. ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాల్వాయి స్రవంతిని మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిగా ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటామనీ, అదే స్ఫూర్తితో ముందుకెళ్తామన్నారు. మునుగోడులో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి ఎంపికపై చర్చోప చర్చలు జరిగాయి.
ఉప ఎన్నికకు కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీ పడ్డారు. స్రవంతితోపాటు స్థానిక నేతలు చల్లమల్ల కష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ నేత తదితరులు టికెట్‌ను ఆశించారు. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారితో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించారు. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల బలాలు, బలహీనతలపై ఏఐసీసీకి నివేదిక పంపించారు. టీపీసీసీ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో టికెట్ ఆశించిన వారికి బుజ్జగించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. శనివారం ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఆధ్వర్యంలో ఆశావాహులతో సమావేశం నిర్వహిం చనున్నారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చేయాలనే హిత బోధ చేయనున్నారు. టికెట్ ఆశించిన నలుగురు సభ్యులు ఎవరికి వచ్చినా తమ అభ్యర్థిని గెలిపించుకునేలా కృషి చేయాలని కోరారు.