Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
తెలంగాణ గొంతు కాళోజీ అని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ బాటలో నడవాలని హోంమంత్రి మహమూద్ అలీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే కాళోజీ శయారీలు (కవిత్వాలు) అల్లారని, ఆయన వంటి కవులు అరుదుగా పుడతారని కొనియాడారు. కాళోజీ జయంతిని భాషా దినోత్సవంగా జరుపుకోవటం, వారి పేరిట విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. శుక్రవారం రవీంద్రభారతీ ప్రధాన వేదికపై రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో కాళోజీ జయంతిని, భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త రామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. కాళోజీ నిజమైన తెలంగాణ భాషా సేవకుడు, ప్రేమికుడు అన్నారు. ఆయన కవిత్వం ప్రజల సాధారణ భాషలో.. వారి కష్టాలు, ఇక్కట్లు, అణచివేతల అంశాలతో వాస్తవికతకు ప్రతిబింబంగా ఉండేదన్నారు. నేడు అలాంటి పరిస్థితి నుంచి తెలంగాణ సమాజం బయట పడుతోందన్నారు. కానీ కొన్ని శక్తులు తెలంగాణ పచ్చదనం, ఐక్యతను చూడలేక మతం, కులాల పేరిట చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కవులు, కళాకారులు నేడు దేశంలో జరుగుతున్న విద్వేష రాజకీయాల పట్ల ప్రజలను జాగరూకులను చేయాలన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు మంత్రి శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రజల భాష పాలకుల భాష కావాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష వాడాలని, అదే కాళోజీకి నివాళి అన్నారు. కవి, రచయిత, ప్రజా గాయకులు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మాట్లాడుతూ.. కాళోజీ అంటే భాగ్యరెడ్డి వర్మ, వట్టి కోట ఆళ్వార్ స్వామిల ధిక్కార, తిరుగుబాటు కొనసాగింపు అన్నారు. తెలంగాణ సమాజాన్ని కుల, మత విద్వేషాల పేర విడగొట్టే ప్రయత్నాలు సాగనీయరాదని, హరగోపాల్ వంటి సామాజిక రచయితలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి.రమణ, సంగీత నాటక అకాడమీ చైర్మెన్ డాక్టర్ దీపికా రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, కవి సుద్దాల అశోక్ తేజ, సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తానీయ పాల్గొన్నారు.