Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఆగస్టు 31న ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. సుమారు 6లక్షలకుపైగా విగ్రహాలను ప్రతిష్టించారు. నిమజ్జనాన్ని చూడ్డానికి లక్షలాది మంది తరలివచ్చారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు,ఎన్టీఆర్ మార్గ్ ప్రాం తాల్లో ఇసుకెేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. దీంతోపాటు లడ్డు వేలంలో ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ లడ్డు అత్యధిక రేటు పలికింది. ఈసారి గచ్చిబౌలిలోని మైహోం భుజాలో సైతం లడ్డూ భారీ స్థాయిలో ధర పలికింది.
7గంటలకే మట్టి వినాయకుని నిమజ్జనం
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి, నిమజ్జనం ఒకెత్తయితే ఖైరతాబాద్ పంచముఖ మహాలక్ష్మి గణపతి మరో ఎత్తు. ఈసారి 50అడుగుల్లో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాత్రి 7గంటలకే నిమజ్జనాన్ని పూర్తి చేశారు. గ్రేటర్‌వాసులు, తెలుగు రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన అశేష జనవాహిణి నడుమ పంచముఖ మహాలక్ష్మి గణపతికి వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 12.12గంటలకు మండపం నుంచి బయటకు తీసిన ఖైరతాబాద్ గణపతి శోభయాత్రం 6గంటలకుపైగా సాగింది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. మహా గణపతి నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా హుస్సేన్‌సాగర్ వరకు 6గంటలకుపైగా శోభాయాత్ర కొనసాగింది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ నిర్వహించారు. 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిం చారు. 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న 26 టైర్ల టస్కర్ వాహనంతో మహాగణపతిని తరలించారు. 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్ పంచముఖ మహాగణపతి శోభాయాత్ర సన్‌షైన్ థియేటర్, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్‌భవన్, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది.
ఎంజే మార్కెట్ వద్ద
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పాల్గొన్న బహిరంగసభలో ఉద్రిక్తత నెలకొంది. శర్మ మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్త నందుబిలాల్ సమీపం దాకా వచ్చి సీఎంపైకి మైక్ విరిచేశాడు. దైవ కార్యక్రమానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం, కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంపై శర్మను ఉద్దేశించి కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్టాడు. దాంతో అప్రమత్తమైన భాగ్యనగర్ ఉత్సవ్ సమితి నాయకులు వెంటనే టీఆర్ఎస్ కార్యకర్తను స్టేజీపై నుంచి కిందకు దించేశారు. పోలీసులు అతన్ని అక్కడ నుంచి తరలించారు. అంతకు ముందు హిమంత బిశ్వశర్మ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో ప్రభుత్వం నిజాం పాలనని కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు. కుటుంబ పాలన నుంచి విముక్తి కలగాలని భాగ్యలక్ష్మీ అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు
బాలాపూర్ గణేశుడి లడ్డు మరోసారి రికార్డు ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్యాదవ్తో కలసి నాదర్గుల్వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డును రూ.18.90 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. బాలాపూర్ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రులు సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి హాజరయ్యారు. 2019లో రూ.17.60 లక్షలకు లడ్డును రాంరెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే. 1994 నుంచి బాలాపూర్ లడ్డు వేలం పాట నిర్వహిస్తున్నారు. కొవిడ్ కారణంగా గతేడాది వేలంపాట జరగలేదు. దీంతోపాటు ఈసారి గచ్చిబౌలిలో మైహోం భుజాలో లడ్డు వేలంలో రూ.20.50లక్షల ధర పలికింది. బడంగ్పేట్ లడ్డు రూ.12లక్షలు, కర్మన్‌ఘట్‌లో మాధవరం సెరినిటిలో రూ.11.11లక్షలు, కూకట్‌పల్లిలో రూ.3.90లక్షలు, చంపాపేట్‌లో రూ.2.50లక్షలు పలికాయి.