Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది ఫ్యూడలిజం కోరలు పీకిన ఉద్యమం. 'నీ బాన్చనన్న' బక్కోడికి వెయ్యేనుగుల బలాన్నిచ్చిన పోరాటం అది. కుల మతాలకతీతంగా పేదల్ని ఐక్యం చేసిన అత్యున్నత స్థాయి వర్గ విప్లవమది. దాన్ని మింగడం మీవల్ల కాదు బత్తాయి నేతల్లారా! భగత్ సింగ్ వంటి వీర కిషోరాలను కబళించలేక మీనోళ్లు చిరిగిపోలేదా? చేతిలో భగవద్గీత పట్టుకుని ఉరికంబం ఎక్కాడనే మీ ప్రచార పటాటోపం 1930లో లాహౌర్ సెంట్రల్ జైలు నుండి భగత్‌సింగ్ రాసిన లేఖతో పటాపంచలు కాలేదా? 'నేను నాస్తికుడిని ఎలా అయ్యాన'నే లేఖతో మీ గూబగుయ్యిమనలేదా? ఏమైనా వ్యక్తుల్ని మింగినంత తేలికకాదు విప్లవాల్ని మింగడం! అటువంటిదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ప్రజలు నిజాంపై తిరగబడ్డారని, సర్దార్ పటేల్ నిజాం నుండి 'విమోచన' చేశాడనేది మీ పల్లవి. సినిమా క్లైమాక్స్‌లో కరెంట్ పోయినట్లే ఉంటుంది అక్కడే ఆగిపోతే! సెప్టెంబర్ 17 తర్వాత నిజాంకు 'రాజ్ ప్రముఖ్' (గవర్నర్) పదవి ఇచ్చారు. కాసీం రజ్వీని 'సగౌరవంగా' పాకిస్థాన్‌కి సాగనంపారు. ప్రజల రక్తం పీల్చి సంపాదించిన ఆస్తులు నిజాంకే వదిలేశారు? ఆ రోజుల్లోనే సాలుకి రూ.50లక్షల జీతం ఇచ్చారు? ఇవన్నీ పటేల్ ఆధ్వర్యంలోనే జరిగాయనే సంగతి మీకు తెలిసినా ప్రజల చెవుల్లో కమలం పువ్వు ఎందుకు తురమదల్చుకున్నారనేది వేరే సంగతి.
మీ అబద్ధాల ఫ్యాక్టరీలో తయారయ్యే సరుకులు తొందరగా పాసిపోయి గబ్బుకొడుతున్నాయనే సంగతి మీకు యాదికుండటం మంచిది. స్వాతంత్య్రం తెలంగాణకు 13నెలలు ఆలస్యంగా వచ్చిందన్న మాట నిజం. త్వరగా రావడానికి, ఆ 13నెలల తర్వాతనైనా రావడానికి గాని మీరు చేసిందేమైనా ఉందా అని మన తెలంగాణలోని సామాన్యులడుగుతున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దాడటానికి మీకు పెద్దగా సిగ్గనిపించకపోయినా, పుట్టిన 75ఏండ్ల తర్వాత వచ్చి అది నా బిడ్డే అంటున్నందుకు ఆ బిడ్డే సిగ్గుపడుతున్నది!
ముస్లిం రాజుకు హిందూ ప్రజలకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించే ఆటలు తెలంగాణలో సాగవు. హైదరాబాద్ సంస్థానంలో ప్రజల చైతన్యాన్ని రగిలించడం కోసం మొట్టమొదట ప్రయత్నించిన వారిలో ముల్లా అబ్దుల్ కయ్యాం ఉన్నారనే విషయం బత్తాయి చరిత్ర కారులకు తెలుసా? తొలిదశ అమరుడు షేక్ బందిగీ గురించి కనీసం విన్నారా? ''హయాత్ లేకే చలో, కాయనాత్ లేకే చలో, చలేతో సారే జమానేకో సాత్ లేకే చలో'' లాంటి ఎన్నో కవితల ద్వారా నిజాంపై ప్రజల్ని తండోపతండాలుగా కదిలించిన మగ్ధూం మొహియుద్దీన్ గురించి మీ కెరికేనా? హైదరాబాద్‌లో స్థాపించిన ''కామ్రేడ్స్ అసోసియేషన్'' గురించి, దాని నాయకుడు జవాద్ రజ్వీ గురించి మీరెప్పుడైనా విన్నారా? సయ్యద్ ఇబ్రహీం, అలంఫ్ు మీర్ వంటివారంతా ముస్లింలేనన్న సంగతి మీరు సౌకర్యవంతంగా మీ నిఘంటువు నుండి తొలగించేశారులే..!
దాదాపు మూడేండ్లకి పైగా నెహ్రూ-పటేల్ సైన్యం తెలంగాణలో సాగించిన అమానుష భీభత్సకాండ రజాకార్ల కేమీ తీసిపోలేదు. రజాకార్ల చేతిలో 15వందల మంది మన తెలంగాణ వీరపుత్రులు హతులైతే, భారతసైన్యం చేతిలో, అంటే పటేల్గారి సైన్యం చేతిలో 2500 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ''ఆపరేషన్ పోలో'' లక్ష్యం నిజాం కాదు, కమ్యూనిస్టులు. వారు పంపిణీ చేసిన పదిలక్షల ఎకరాల భూమిని తిరిగి భూస్వాములకు కట్టబెట్టడం, నిర్మితమైన గ్రామ రాజ్యాల్ని ధ్వంసం చేయడం. నాలుగువేల మంది కార్యకర్తల ప్రాణ బలిదానంతోనే 13నెలలు ఆలస్యంగానైనా తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. దీనిలో తమరి నిర్వాకం ఏమైనా, ఎక్కడైనా ఉందా? అప్పుడైనా, ఇప్పుడైనా మీ గోత్రీకులందరూ పీడకులే! అదే మీకూ అ సాయుధ పోరుకూ ఉన్న అనుబంధం. సంబంధం.